ఐస్‌క్రీమ్‌’ బడ్జెట్ పై మీడియాకు వర్మ లేఖ

Tuesday, July 15th, 2014, 04:50:38 PM IST


డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో హాట్ టాపిక్ కు తెర తీశాడు. ‘ఐస్ క్రీమ్’ మూవీ విడుదల తర్వాత రామ్ గోపాల్ వర్మ కొత్త వివాదానికి తెర లేపాడు. ఐస్ క్రీమ్ మూవీపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై ఘాటుగా స్పందించిన వర్మ ఇప్పుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రివ్యూలు రాసే వారిని క్షమాపణలు కోరాడు. తన సినిమాకు అయిన బడ్జెట్ కేవలం 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయిలు మాత్రమే అయిందంటూ హాట్ టాపిక్ కు తెర తీశాడు వర్మ.

‘ఐస్ క్రీమ్’ తయారీ వెనకాల వున్న మెలుకువలని అర్ధం చేసుకుంటే ప్రస్తుతమున్న ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయి ఒక సరికొత్త ఫిల్మ్ఇండస్ట్రీ పుడుతుందంటూ కొత్త నిర్వచనం ఇస్తున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. కంటెంట్ అనేది పది కోట్లు ఖర్చు పెట్టినా బోర్ కొట్టచ్చు.. కోటి రూపాయలతో తీసినా ఇంట్రెస్టింగా ఉండచ్చు. ఖర్చు పెట్టినంత మాత్రాన కంటెంట్ ఇంట్రెస్టింగా ఉండాలన్న రూల్ లేదని కొన్ని వందల ఫ్లాప్ లు రుజువు చేశాయంటున్నాడు వర్మ.

అయితే ఐస్ క్రీమ్ మూవీకి మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయలు ఎలాగైందో వివరించి చెప్పాడు వర్మ. ఆ ఇంటి రెంట్ కి, టీలకి, కాఫీలకి ఆ ఖర్చు అయిందని.. ఆ ఇంటి ఓనర్ సినిమా టీమ్ లో భాగం కాదు కనక ఆ రెంట్ ఖర్చు తప్పలేదన్నాడు. ఐస్ క్రీం సినిమాలో లైట్లు, ట్రాక్ ట్రాలీలు, జిమ్మీ జిబ్ లు, స్టడీ క్యాంలు ఏమీవాడలేదన్నాడు. 70 శాతం సినిమా గింబల్ అనే చీపయిన పరికరంతో తీశాడట. అందుకే విజువల్స్ అంత కొత్తగా ఉన్నాయంటున్నాడు. ఇంకా ఫ్లో-క్యాం పద్దతిలో సినిమా తియ్యడం మూలాన యూనిట్ లో పని చేసే వాళ్ల సంఖ్య రెగ్యులర్ సినిమా కన్నా 90 శాతం తగ్గిపోయిందన్నాడు. షూటింగప్పుడు అందరూ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసివచ్చేవాళ్లు. లంచ్ ఎవరికి వాళ్లు వాళ్లే తెచ్చుకునేవాళ్లు. నవదీప్, తేజస్విలు సినిమాకోసం వేసుకున్న బట్టలు వాళ్ల సొంత బట్టలు అని తన సినిమాకు ఎందుకింత తక్కువ ఖర్చు అయిందో సీక్రెట్ చెప్పేశాడు వర్మ.

‘ఐస్ క్రీమ్’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పాడు వర్మ. ఈ మూవీకి తొలి రెండు రోజులకే 90 లక్షల కలెక్షన్లు వసూలు అయ్యాయట. ఐస్ క్రీం కి వచ్చిన ఓపెనింగ్ ఏం ప్రూవ్ చేసిందంటే ఆడియన్స్ ని థియేటర్లోకి అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని.. కేవలం ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చాలని రుజువైందంటున్నాడు వర్మ. పైసా ఖర్చులేనిది ఐడియా మాత్రమేనని.. తాను చెప్పేదానికి చివరర్ధం ఏమిటంటే ఐడియా ఉన్నవాడెవ్వడైనా సరే ఆ ఐడియాతో మిగతా వాళ్ళని కన్విన్స్ చెయ్యగలిగితే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సినిమా తీసేయ్యొచ్చంటున్నాడు ఆర్జీవీ.
‘ఐస్ క్రీమ్’ సూపర్ హిట్ అయ్యి లాభమొచ్చిన సందర్భంగా నిర్మాత రామ సత్యనారాయణ పని చేసిన అందరికీ వాళ్ల వాళ్ల పేమెంట్ లు అందజేస్తారని వర్మ తెలిపాడు. మొత్తానికి సినిమా నిర్మాణనికే కాదు.. పైసా ఖర్చు లేకుండా తన మూవీకి విపరీతంగా పబ్లిసిటీ తెచ్చిన ఘనత వర్మకే దక్కుతుంది.