పుకార్లకు చెక్ పెట్టిన రాంచరణ్ మూవీ టీం!

Sunday, May 6th, 2018, 09:37:02 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సూపర్ హిట్ తో ప్రస్తుతం మంచి ఊపులో వున్నాడు. ఆయన ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఒక చిత్రం చేస్తున్నారు. భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఒకప్పటి నటుడు ప్రశాంత్, స్నేహ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా గత కొద్దిరోజులుగా ఈ చిత్రం స్టోరీ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, హీరో రాంచరణ్ చిత్రం విషయంలో సంతృప్తిగా లేరని పలు పుకార్లు వినిపించాయి. అయితే నేడు ఆ పుకార్లు అన్నిటికీ నిర్మాత దానయ్య ఫుల్ స్టాప్ పెట్టారు.

చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుందని, తదుపరి ఈ నెల 12నుండి బ్యాంకాక్ లో 15రోజులపాటు జరిగే షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ కైరా అద్వానీ ల పాత్రలు చిత్రంలో చాలా బాగా వుంటాయని, యూనిట్ సభ్యులు మొత్తం ఒక కుటుంబంలా షూటింగ్ లో ఆనందంగా పాల్గొంటున్నారని అన్నారు. దర్శకుడు బోయపాటి మెగా ఫాన్స్ ని , అలానే ఆయన మార్క్ మాస్ ఎలిమెంట్స్ ని మిస్ కాకుండా మంచి ఫామిలీ ఎమోషన్స్ తో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారని అన్నారు…..