కేసీఆర్ మంత్రివ‌ర్గంపై రాముల‌మ్మ నిప్పులు!

Monday, February 11th, 2019, 03:05:58 PM IST

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతి ఉర‌ఫ్ రాముల‌మ్మ కేసీఆర్ మంత్రి వ‌ర్గంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌క్క‌న్న‌ `ఆర్ ఆర్ ఆర్‌` తో కేసీఆర్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ను పోలుస్తూ రాముల‌మ్మ చ‌లోక్తులు పేల్చ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో రాజ‌కీయం పెద్ద‌గా ఒంట‌బ‌ట్ట‌ని రాముల‌మ్మ ఈ ద‌ఫా గేరు మార్చి కేసీఆర్‌పై సునిశిత విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా స్పందిస్తున్న రాముల‌మ్మ తాజా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రానికి వ‌చ్చే క‌లెక్ష‌న్‌ల‌ను అధిగ‌మించే విధంగా కేసీఆర్‌గారు కొత్త `ఆర్ ఆర్ ఆర్‌` ప్రాజెక్ట్‌కి శ్రీ‌కారం చుట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ కేసీఆర్‌ `ఆర్ ఆర్ ఆర్‌`ఏమిటంటే రీజిన‌ల్ రింగ్ రోడ్‌. ఈ `ఆర్ ఆర్ ఆర్‌`కు తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో జ‌రిగే ఆల‌స్యానికి లింక్ వుంద‌ని తెరాస నేత‌లు చెబుతున్నారు. కేబినెట్‌లో చేర‌డం అంటే మంత్రులుగా ప్ర‌మాణం చేసేవారు కొంత రిస్క్ చేయ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. కేసీఆర్ కొత్త క్యాబినెట్‌లో చేర‌బోయే వారికి కొత్త‌గా ష‌ర‌తులు విధిస్తున్నారు.

ఆ ష‌ర‌తులు ఏమిటంటే..తెరాస ప్ర‌భుత్వం రీజ‌న‌ల్ రింగురోడ్డు పేరుతో చేయ‌బోతున్న ల‌క్ష‌కోట్ల కుంభ‌కోణానికి మంత్రులు ఆమోద ముద్ర వేయ‌డంతో పాటు దానికి పూర్తి భాధ్య‌త వ‌హించాలి. రేపు ఏమైనా చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు వ‌స్తే మంత్రులే భ‌రించాలి. దీనికి సిద్ధ‌ప‌డిన వాళ్లు మాత్ర‌మే మంత్రులుగా ప్ర‌మాణం చెయ్యాల‌ని కేసీఆర్‌గారు మెలిక పెట్టార‌ట‌. ఈ ష‌ర‌తుల‌కు అంగీక‌రించ‌లేదు కాబ‌ట్టే హ‌రీష్‌రావు లాంటి సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని చూస్తున్నారు. కేసీఆర్ కేబినెట్ మంత్రుల‌ని ర‌బ్బ‌రు స్టాంపుల్లా వాడుకుంటార‌ని తెలుసు కానీ .. ప్ర‌భుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాల‌నుకోవ‌డం దారుణం` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా రాముల‌మ్మ పెట్టిన పోస్ట్‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి.