రాముల‌మ్మ కొత్త ప‌ల్ల‌వి.. వినేదెవ‌రు?

Friday, February 1st, 2019, 12:38:32 PM IST

తెరాస‌ను వీడి కాంగ్రెస్ లో చేరిన త‌రువాత కొంత కాలంగా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వినిపించ‌కుండా సైలెంట్‌గా వున్న రాముల‌మ్మ విజ‌య‌శాంతి ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ గా రంగంలోకి దిగిన ఆమె అధికార తెరాస‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. అయినా ఎన్నిక‌ల్లో ఫ‌లితం లేకుండా పోయింది. ఇటీవ‌ల స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా తెరాస‌కు అనుకూలంగా రావ‌డంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై దృష్టిపెట్టిన ఆమె కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. గ‌త కొన్ని రోజులుగా అభిమానుల‌తో ట్విట్ట‌ర్ వేదిక‌గా ట‌చ్‌లో వుంటున్న ఆమె ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

గ‌త రెండు రోజులుగా ఏపీ రాజ‌కీయాల ప‌రిణామాలు చూస్తుంటే ప్ర‌ధాన పార్టీల తీరు ఆయోమ‌యంగా, కొంత ఆశ్చ‌ర్యంగా వుంద‌ని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా విష‌యంలో చిరంజీవికి కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. బీజేపీ త‌ప్ప అన్ని పార్టీలూ ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ వాద‌న‌తో ప్ర‌తీ పార్టీ ల‌బ్ధిపొందాని చూస్తున్నాయి. అయితే ఏక‌తాటిపైకి రావాల‌ని మాత్రం ప్ర‌య‌త్నంచ‌డం లేదు. అలాంటి ఆలోచ‌నే వారికి లేదు. వైసీపీ, టీడీపీలు ఈ విష‌యంపై క‌లిసి క‌ట్టుగా బీజేపీపై పోరాటం చేయ‌రు. ఇక జ‌న‌సేన‌, వైసీపీ మ‌ధ్య ప‌రిస్థితి కూడా ఇలాగే వుంది. మ‌రి బీజేపీపై క‌ల‌సి క‌ట్టుగా పోరాడ‌క‌పోతే ఒత్తిడి ఎలా తీసుకురాగ‌ల‌రు? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు విజ‌య‌శాంతి.

జ‌న‌సేన స‌హా అన్ని పార్టీలు కాంగ్రెస్‌ను బ‌ల‌ప‌ర‌చ‌కుండా ప్ర‌త్యేక హోదా రాద‌న్న లాజిక్‌ను మిస్స‌వుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం తీర్మానం చేసింది. అందుకే కాంగ్రెస్ ల‌క్ష్య సాధ‌న కోసం ఏపీలోని అన్ని పార్టీలు క‌లిసి రావాలని కోరుకుంటున్నాను. ఇందుకు చిరంజీవిగారి లాంటి పాపులారిటీ వున్న ప్ర‌ముఖులంతా ఏపీ ప్ర‌జ‌ల క‌ల‌ను నిజం చేయ‌డానికి కాంగ్రెస్‌తో క‌లిసి రావాలి. దానికి ఇదే స‌రైన స‌మ‌యం. అప్పుడే ఈ ఆప‌రేషన్ విజ‌య‌వంత‌మౌతుంది అని త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టింది. అంతా బాగానే వుంది. ఇక్క‌డ రాముల‌మ్మ మాట వినేదెవ‌రు?. రాముల‌మ్మ కొత్త ప‌ల్ల‌వి ఫ‌లించ‌డం క‌ష్ట‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.