డెడ్ చీపుగా టీవీ 9 లోగోను అమ్మేసిన రవిప్రకాష్ !

Friday, May 17th, 2019, 01:25:14 PM IST

టీవీ 9 న్యూస్ ఛానెల్ బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టిఆర్పి రేటింగ్స్ పరంగా ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఈ ఛానెల్. అలాంటి ఛానెల్ లోగో బ్రాండ్ వేల్యూ కోట్లలోనే ఉంటుంది. కానీ మాజీ సీఈవో మాత్రం కోట్ల విలువ చేసే ఆ లోగోలను డెడ్ చీపుగా అమ్మేశారు. తాజాగా అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు పిర్యాదు ప్రకారం రవిప్రకాష్ సంతకాలు ఫోర్జరీ, నిధుల మళ్లింపు లాంటివే కాకుండా టీవీ 9 లోగోను సొంతం చేసుకునే కుట్ర చేశారని స్పష్టమైంది.

రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డిలు టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ అయిన మీడియా నెక్ట్స్‌ ఇండియాకు కేవలం రూ.99 వేలకు కట్టబెట్టేశారు. 2018 మే 22న కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లోగోలను విక్రయిస్తున్నట్టు 2018 డిసెంబరు 31న డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా వారికి రాసిచ్చేశారు. లోగోలు తమకు అమ్మింనందుకుగాను నెక్ట్స్‌ ఇండియా ఖాతా నుండి టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీపీఎల్‌ వారికి 2019 జనవరి 22న 99,000 రూపాయలను పంపారు. ఇదంతా కంపెనీలో మెజారిటీ వాటాలు కలిగిన వారికి తెలియకుండానే జరిగిపోయింది.

ఇలా రవిప్రకాష్ అండ్ టీమ్ కోట్లాది రూపాయల విలువలు కలిగిన లోగోలను అక్రమంగా అతి తక్కువ ధరకే అమ్మేశారని కౌశిక్ రావు పిర్యాదు చేయగా రవిప్రకాష్ ఈమెయిల్ సంభాషణను పరిశీలించిన పోలీసులు ఆయనపై ఇంకొన్ని కొత్త కేసులు నమోదు చేశారు.