హైడ్రామా న‌డుమ‌ రాయ‌పాటికి టికెట్ క‌న్ఫామ్‌!

Friday, March 15th, 2019, 10:15:47 AM IST

న‌ర‌సారావు పేట సిట్టింగ్ రాయ‌పాటి సాంబిశివ‌రావు టికెట్ విష‌య‌మై గ‌త కొన్ని రోజులుగా టీడీపీలో హైడ్రామా చోటు చేసుకుంది. గ‌త మూడు రోజ‌లుగా ఈ స్థానం కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌స‌ర‌త్తు చేసినా అభ్య‌ర్థి ఎంపిక కొలిక్కి రాలేదు. దీంతో భాష్యం విద్యా సంస్థల అధినేత రామ‌కృష్ణ‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. న‌ర‌సారావు పేట స్థానం త‌న‌కే కావాల‌ని రాయ‌పాటి ప‌ట్టుబ‌డుతున్నా అధినేత మాత్రం మ‌రో అభ్య‌ర్థి కోసం వెతుకులాట సాగించ‌డం రాయ‌పాటికి మ‌న‌స్థాపాన్ని క‌లిగించింద‌ట‌. దీంతో ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం వుంద‌ని గ్ర‌హించిన సుజ‌నా చౌద‌రి, టీడీ జ‌నార్థ‌న్, మంత్రులు పుల్లారావు, నారా లోకేష్ ఆయ‌న‌తో మంత‌నాలు జ‌రిపి పార్టీ మార‌కుండా శాంత‌ప‌రిచారు.

అయినా రాయ‌పాటి శాంతించ‌లేదు. విష‌యం గ్ర‌హించిన చంద్ర‌బాబు మొద‌టికే మోసం వ‌చ్చేలా వుంద‌ని న‌ర‌సారావు పేట ఎంపీ స్థానాన్ని రాయ‌పాటికే కేటాయించ‌డంతో గ‌త మూడు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెర ప‌డింది. రాయ‌పాటితో ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చించిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప‌రిస్థితి చేయిదాటిపోయేలా వుంద‌ని చంద్ర‌బాబుకు చెప్ప‌డంతో రాయ‌పాటి డిమాండ్‌కు చంద్ర‌బాబు దిగిరాక త‌ప్ప‌లేదు. త‌న టికెట్ కోసం పంతం ప‌ట్టిన రాయ‌పాటి మొత్తానికి అనుకున్న‌ది సాధించార‌ని పార్టీ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.