వైసీపీలోకి క్యూ కట్టిన టీడీపీ నేతలు – గుడ్ బై చెప్పనున్న సీనియర్ నేత..!

Thursday, March 14th, 2019, 03:21:30 PM IST

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీ, తెలంగాణాలో ఒకేసారి ఎన్నికలు జరగనుండటంతో పార్టీలన్ని అభ్యర్థుల జాబితా తయారు చేయటం, ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేయటంలో తలమునకలై ఉన్నాయి. ఎన్నికల్లో సీటే లక్ష్యంగా నాయకులంతా పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేసారు, ముఖ్యంగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు టీడీపీ వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోగా తాజాగా గుంటూరు జిల్లా ముఖ్యనేత రాయపాటు సాంబశివరావు వైసీపీలో చేరనున్నట్టు సమాచారం అందుతోంది.

నరసరావుపేట ఎంపీ స్థానాన్ని రాయపాటికి కాకుండా భాష్యం రామకృష్ణకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. నరసరావుపేట ఎంపీ టికెట్ తనకు, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాన్ని తన కుమారుడికి కేటాయించాలని కోరగా, కుదరదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే రాయపాటిని పార్టీలోకి ఆహ్వానిస్తూ పలువురు వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగారట, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై రాయపాటి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.