దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పెను ముప్పు సంకేతం!!

Friday, November 2nd, 2018, 12:53:53 PM IST

మోడీ ప్ర‌భుత్వానికి, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మ‌ధ్య రాజుకున్న నిప్పు తారా స్థాయికి చేరుకుంది. దీనికి ఆర్ఎస్‌ఎస్‌కు చెందిన స్వ‌దేశీ జాగ‌ర‌ణ్ మంచ్ మ‌రింత ఆజ్యంపోస్తూ ఆర్‌బీఐ వ‌ర్గాల‌ను రెచ్చ‌గొడుతోంది. స్వ‌దేశీ జాగ‌ర‌ణ్ మంచ్ కు చెందిన ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం అధ్య‌క్షుడు అశ్వ‌నీ మ‌హాజ‌న్ చేసిన వ్యాఖ్యలు ఆర్‌బీఐకి మ‌రింత ఆగ్ర‌హాన్ని తెప్పించేలా వున్నాయి. బీజేపీకి ఫేవ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి అనూహ్యంగా ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉర్జిత్ ప‌టేల్ ప్ర‌స్తుతం మోడీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు మోకాల‌డ్డుతుండ‌టం ఆ పార్టీ స‌హించ‌లేక‌పోతోంది.

దీన్ని ఆస‌రాగా తీసుకున్న బీజేపీ శ్రేణులు ఉర్జిత్ ప‌టేల్‌పై విషం క‌క్కుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికి మోడీతో క‌లిసి ప‌నిచేయాల‌ని, లేదంటే ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని ఉర్జిత్‌ను అశ్వ‌నీ మ‌హాజ‌న్ బెదిరిస్తుండ‌టం బీజేపీ శ్రేణులు ఏ స్థాయిలో కీల‌క వ్య‌వ‌స్థ‌ల్ని ప్ర‌భావితం చేయాల‌ని చూస్తున్నారో అద్దంప‌డుతోందిని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఉర్జిత్‌పై విరుచుకుప‌డుతున్న అశ్వ‌నీ మ‌హాజ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సైద్ధాంతిక‌ స‌ల‌హాదారుడు కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

అశ్వ‌నీ మ‌హాజ‌న్ వ్యాఖ్య‌ల వెనుక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వున్నాడ‌ని, బీజేపీ శ్రేణులు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌పై, అందులో కీల‌కంగా వున్న వ్య‌క్త‌లుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా మోడీ కానీ కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు కానీ స్పందించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇది ఇలాగే కొన‌సాగితే దేశ ఆర్థిక మూలాల‌తో పాటు, కీల‌క వ్య‌వ‌స్థ‌లు కుదేల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ పండితులు వాపోతున్నారు.