ఎన్టీఆర్ వీర భక్తులు లేరనే కదా చంద్రబాబు ధైర్యం !

Thursday, December 6th, 2018, 06:03:20 PM IST


మహానాయకుడు ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారని అనడం కన్నా వీర భక్తులు ఉండేవారని అనడం సబబు. ఎందుకంటే ఆనాటి ప్రజానీకం ఆయన్ను వెండి తెర మీద మాత్రమే కాదు రాజకీయాల్లో సైతం ఒక దేవుడిలానే భావించింది. ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది. ఆయన ఆదేశం ప్రకారమే 1983లో కాంగ్రెస్ ను రాష్ట్రం నుండి వెళ్లగొట్టి టీడీపీకి పట్టం గట్టారు. కొన్ని కుట్రల మూలాన అధికారం కోల్పోయినా కేవలం ఒక యాత్రతో పోయిన అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేంత శక్తిని అప్పటి జనం ఆయనకిచ్చారు. ఇలాంటి భక్తుల క్యాడర్ తెలుగునాట ఎన్టీఆర్ కు మినహా మరొక నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ కూడ ప్రజలు తన పట్ల చూపిన భక్తికి కృతజ్ఞతగా సుపరిపాలన అందించేందుకు సర్వ శక్తులు ఒడ్డి పనిచేశారు. వారి మనోభావాలు ఇసుమంత కూడ దెబ్బ తినకుండా పార్టీని నడిపారు.

కానీ ఇప్పుడు చంద్రబాబు మొత్తానికి ఎన్టీఆర్ ఆశయాలకు, పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు రేపో మాపో ఏపీలో కూడ ఉదయిస్తుంది. బాబు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి సాహసించడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. అందులో ప్రధానమైనది అప్పుడున్న ఎన్టీఆర్ భక్తగణం, పార్టీ సిద్ధాంతాల్ని నరనరాన ఇంకించుకున్న కార్యకర్తలు ఇప్పుడు ప్రభావం చూపే స్థాయిలో మనుగడలో లేకపోవడం. ఇదే బాబు ధైర్యం. ఎన్టీఆర్ అంటే నేను, నేనంటే ఎన్టీఆర్.. ఇద్దరి ఆత్మగౌరవం ఒక్కటే అనుకునే ఆయన కల్ట్ ఫాలోవర్స్ కాలానుగుణంగా తగ్గిపోతూ ప్రస్తుతానికి చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు.

ఇప్పుడు పెద్దాయన ఉద్దేశ్యాలు ఏమిటో కూడ పూర్తిగా తెలియని, ఆయన ఫోటోకి మాత్రమే పరిమితం అనుకునే, ప్రస్తుత రాజకీయ ధోరణికి అలవాటుపడిన చాలా మంది బాబు పనికి ఏదో కొంచెం కలవరపడినా చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయారు. దీంతో సొంత పార్టీలో, క్యాడర్లోనే బాబుకు వ్యతిరేకత అనేది లేకుండా పోయింది. ఇక ఇప్పటి యువతకు నచ్చజెప్పడానికి ఇది చారిత్రాత్మక అవసరం, దేశం, రాష్ట్రం బాగుండడం కోసమే ఈ కలయిక, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు వంటి మభ్యపెట్టే కబుర్లు ఆయన వద్ద ఏలాగూ ఉన్నాయి. ఈ అంశాలన్నిటినీ అంచనా వేసుకునే ఆయన ఈ పొత్తుకు తెరలేపారు తప్ప తొందరపాటుతో కాదు. ఎంతైనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉత్తినే వృథా పోదు కదా.