పవన్ పోటీ నుండి వెనక్కు తగ్గడానికి రీజన్ అదే !

Thursday, November 1st, 2018, 09:17:22 AM IST

జనసేన పార్టీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో కూడ చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకోసం ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పి ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు.

పవన్ ఇలా దశలవారీగా వెనక్కు తగ్గడం వెనుక బలమైన కారణమే ఉంది. ముందుగా పార్టీకి తెలంగాణలో సరైన సంస్థాగత నిర్మాణం లేదు. ఉన్న కొద్దిపాటి క్యాడర్ కు దిశా నిర్దేశం చేసే న్యాయకత్వం లేదు. పైగా కేసిఆర్ అనుకున్నదానికంటే కొన్ని నెలలు ముందుగానే ఎన్నికలని తీసుకొచ్చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఎన్నికలకు సిద్దమవడం సాధ్యంకాని పని. కాదు కూడదు అని పంతానికి పోటీలో నిలబడితే అబాసుపాలవడం ఖాయం.

ఈ ఓటమి ఫలితం రాబోయే, ప్రధాన లక్ష్యమైన ఏపీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుంది. ఇన్ని ఇబ్బందులున్నప్పుడు పోటీ చేయకపోవడమే మంచిదని, ముందు పూర్తి దృష్టిని ఏపీపై కేంద్రీకరించాలని నిర్ణయించుకుని పవన్ బరి నుండి వైదొలగారట. పంతాల్ని పక్కనబెట్టి ఆలోచిస్తే పవన్ తీసుకున్న నిర్ణయం సరైనదే.

  •  
  •  
  •  
  •  

Comments