రెడ్డి(X)బీసీ : పొన్నాల డేంజ‌ర్ బెల్‌!?

Saturday, November 10th, 2018, 11:08:49 AM IST


మ‌హాకూట‌మి వ‌ల్ల లాభ‌మేమోగాని కాంగ్రెస్ సీనియర్‌ల‌కు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. కూట‌మి ఒప్పందాల్లో భాగంగా కాంగ్రెస్ సీనియ‌ర్‌లు త‌మ స్థానాల్ని వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్న‌డింది. ఇందులో భాగంగా పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌న‌గామ సీటును వ‌దులుకోవాల్సి వ‌స్తోంది. ఈ స్థానాన్ని తెలంగాణ జ‌న‌స‌మితి అథినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌కు కేటాయిస్తున్నారు. దాదాపు కేటాయింపు ఖ‌రారైపోయింది. ఈ వార్త పొన్నాల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోందిప్పుడు. పార్టీలో సీనియ‌ర్‌ని అయిన న‌న్ను సంప్ర‌దించ‌కుండా నా సీటును కోదండ‌రామ్‌కు కేటాయిస్తున్నార‌ని వార్త‌ల్లో చూసి షాక‌య్యాను. ఓ సీనియ‌ర్ బీసీ నాయ‌కుడిగా నాకు పార్టీ ఇచ్చే గౌర‌వం ఇదేనా?. ఓ బీసీ నాయ‌కుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్థానాన్ని ఓ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి కేటాయిస్తే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని, ఇది పార్టీ భారీ మూల్యం చెల్లించ‌డానికి కార‌ణంగా మారుతుంద‌ని అధిష్టానాన్ని పొన్నాల హెచ్చ‌రిస్తున్నారు.

త‌న సీటు విష‌యంలో పార్టీలో చోటు చేసుకుంటున్న నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో పొన్నాల‌ శుక్ర‌వారం త‌న నివాసంలో మీడియాతో మాట్లాడారు. జ‌న‌గామ సీటు విష‌యంలో జ‌రుగుతున్న నాట‌కీయ ప‌రిణామాలు పార్టీకి మంచిది కాద‌ని, ఈ విష‌యంలో మ‌రోసారి ఆలోచించాల‌ని పార్టీ అదినాయ‌క‌త్వాన్ని కోరారు. రాష్ట్రంలో బీసీలు ఇప్ప‌టికే అభ‌ద్ర‌తాభావంలో వున్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న బీసీల‌కు త‌గిన సీట్లు కేటాయించాల‌నే డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ ఆ స్థానాన్ని ఓ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేటాయించి త‌ప్పు చేస్తుంద‌ని నేను భావించ‌డం లేద‌ని పొన్నాల ధీమాను వ్య‌క్తం చేశారు. స‌డెన్‌గా ఆయ‌న ఇస్తున్న ట్విస్టు అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments