రెడ్ స్టార్ మాదాల రంగారావు మృతి!

Sunday, May 27th, 2018, 09:28:08 AM IST

విప్లవ చిత్రాల నాయకుడు రెడ్ స్టార్ గా పేరుగాంచిన మాదాల రంగారావు (69) నేడు తెల్లవారుఝామున 4.40ని.లకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. 1980వ దశకంలో మంచి ప్రేమ కథ చిత్రాల హవా నడుస్తున్న సమయంలో యువతలో తన విప్లవ చిత్రాలతో మంచి స్ఫూర్తిని నింపిన నటుడు ఆయన.నటుడిగానే కాక నిర్మాతగా మారి నవతరం పిక్చర్స్ పతాకం పై పలుచిత్రాలు నిర్మించి నటించారు. యువతరం కదిలింది చిత్రం తో చిత్ర నిర్మాణం ప్రారంభించిన ఆయన ఎర్ర పావురాలు చిత్రం వరకు విప్లవ చిత్రాలు నిర్మిస్తూ వచ్చారు. ఆయన ఎర్ర మల్లెలు, విప్లవ శంఖం, ప్రజా శక్తి, జనం మనం, ఎర్ర సూర్యుడు, స్వరాజ్యం తదితర చిత్రాలలో నటించి రెడ్ స్టార్ గా పేరెన్నికగాంచారు.

మొదట్లో కొన్ని చిత్రాల్లో విలన్ వేషాల్లో కూడా రంగారావు నటించారు. కాగా అయన మృతిపై ఆయన కుమారుడు మాదాల రవి మాట్లాడుతూ, నాన్న గారికి దాదాపు ఒక సంవత్సరం క్రితం గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించడం జరిగిందని, అప్పటినుండి అయన తరచు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నెల 19న ఆయనకు శ్వాస కోసం సమస్య తో ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో ఆయన్ని ఇక్కడే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశామని, అప్పటినుండి ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదని, నిన్న కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ఆయన తెల్లవారు ఝామున తనువు చాలించారని రవి తెలియచేసారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన రంగారావు చాన్నాళ్ళనుండి ప్రజా నాట్య మండలితో మంచి అనుబంధం ఏర్పడడంతో, సినిమాల్లో నటించే ఆసక్తి కలిగి అలా మెల్లగా సినిమాల్లోకి వచ్చారు. మొదటినుండి సమాజంపట్ల, ప్రజల పట్ల మంచి అభ్యుదయ భావాలతో ఉండేవారని, అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విప్లవ చిత్రాలనే ఆయన నిర్మించారని ఆయన సహచరులు పోకూరి బాబురావు తెలిపారు. కాగా హీరో గోపీచంద్ తండ్రి టి కృష్ణ, మాదాల రంగారావు, ఈ తరం ఫిలిమ్స్ అధినేత పోకిరి బాబురావు ముగ్గురు మంచి సహచరులుగా ఉండేవారు. అయన బ్యానర్ పై 1980 లోతీసిన తొలి చిత్రం యువతరం కదిలింది చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం నుండి బంగారు నందిని గెలుచుకుంది. కాగా ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments