ఒక ఆత్మహత్య కేసిఆర్ పతనాన్ని కోరుతోంది !

Wednesday, September 19th, 2018, 02:36:58 PM IST

అధికారం చేపట్టినప్పటి నుండి కేసిఆర్ ను వెంటాడుతున్న అంశం నిమ్న కులాలు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి తానే గద్దెనెక్కిన కెసిఆర్ పై ఆరంభం నుండి దళిత సంఘాలు, నాయకులు కొంత ఆగ్రహంగానే ఉన్నారు. టి.రాజయ్యను మంత్రివర్గం నుండి తప్పించడంతో ఈ కోపం మరింత ఎక్కువైంది. మాదిగలంతా కేసిఆర్ తమపై కక్ష కట్టడాన్ని దృఢమైన అభిప్రాయానికి వచ్చేశారు.

దానికి తోడు 2014 ఎన్నికల సమయంలో చెప్పినట్టు మాదిగలకు మూడెకరాల భూమి పథకాన్ని అమలు చేయకపోవడంతో మాదిగలంత కేసిఆర్ కు వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. అగ్నికి ఆజ్యం అన్నట్టు అసెంబ్లీ రద్దు తర్వాత ప్రకటించిన తొలిదశ అభ్యర్థుల జాబితాలో చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ ఇవ్వకుండా బాల్క సుమన్ కు ఇవ్వడంతో అక్కడి మాదిగలు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు.

ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఆత్మహత్యతో ఈ పరిణామం అంతిమ దశకు చేరుకుంది. మాదిగలంతా కేసిఆర్ అంతమే తమ శపథం అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కేసిఆర్ మొదటి నుండి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని, పూర్తిగా తమను అణగదొక్కే ఉద్దేశ్యంతోనే ఓదేలుకు, మాదిగ నాయకురాలు బోడిగ శోభకు టికెట్లు ఇవ్వలేదని, అక్రమాలకు పాల్పడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. చిలికి చిలికి గాలి వానగా మారిన ఈ వ్యతిరేక ధోరణి రాబోయే ముందస్తు ఎన్నికల్లో కేసిఆర్ కు పెద్ద నష్టాన్ని మిగిల్చే అవకాశాలే ఎక్కువ.