అన్నయ్య దెబ్బేశాడు..తమ్ముడి బిజినెస్ క్లోజ్..!

Wednesday, October 25th, 2017, 03:56:35 PM IST

రిలయన్స్ జియో వలన పేరు మోసిన టెలికాం కంపెనీలే విలవిలలాడుతున్నాయి. అంతెందుకు అన్నయ్య దెబ్బ తమ్ముడికి గట్టిగా తగిలింది. ముకేశ్ అంబానీ జియో వలన అనిల్ అంబానీ 2జి బిజినెస్ క్లోజ్ కానుంది. అనిల్ అంబానీకి చెందిన వైర్ లెస్ కమ్యూనికేషన్ బిజినెస్ మరియు 2జి బిజినెస్ ని నడుపుతున్న ఆర్ కామ్( రిలయన్స్ కమ్యూనికేషన్స్) ని నవంబర్ 30 నాటికి క్లోజ్ చేయనున్నట్లు ఆసంస్థ ప్రకటించడంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నెల రోజులు ఉద్యోగులకు నోటీస్ పిరియడ్. నష్టాలతో ఇంతకుమించి సంస్థని నడపలేమని ఉన్నతాధికారులు ప్రకటించారు.

జియో వచ్చాక మొబైల్ ఇంటర్నెట్ సేవలు, టెలికాం సేవలు చాలా చౌకగా మారిపోయాయి. దానిప్రభావాన్ని తట్టుకోవడం మిగిలిన సంస్థలకు కత్తి మీద సాములా మారింది. కొనఊపిరితో కూడా బిజినెస్ ని నడపడానికి చాలా ప్రయత్నించాం. కానీ కుదరలేదు. 2జి బిజినెస్ కు కర్టెన్ దించాల్సిన స్థితిలో మేము ఉన్నాం. 30 రోజులకు మించి కంపెనీని నడపలేం అని సంస్థ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ తెలిపారు. నవంబర్ 30 తమ చివరి పని దినంగా ఆయన ప్రకటించారు. కాగా కంపెనీని తీవ్రమైన నష్టాల బాట పట్టడడంతో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా 3జి మరియు 4జి సేవలని కొనసాగించనున్నట్లు సమాచారం.

ఆర్ కామ్ సంస్థ దాదాపు 46 వేల కోట్ల రుణంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆర్ కామ్ మరియు ఎయిర్ సెల్ సంస్థలు మెర్జ్ కావడానికి ఒప్పందం కుదిరింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ రెండు విడిపోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్ కామ్ సంస్థ టవర్ బిజినెస్ కూడా సందిగ్ధం లో పడింది. అధికారులు మాత్రం ఆ బిజినెస్ కొనసాగుతుందని చెబుతున్నారు.