అంతరిక్షంలో రెస్టారెంట్… భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో

Monday, April 9th, 2018, 06:11:54 PM IST

వీకెండ్ వస్తే చాలు గందరగోలాలకు కొంచం దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని చాలా మంది అనుకుంటారు. పని ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి అలా అలా విహరిస్తారు. మరి ఏకంగా భూమికే కాస్త దూరంగా అలా అంతరిక్షంలో విహరించాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వాళ్ల కోసమే స్పేస్‌లో ఓ లగ్జరీ హోటల్ తయారవుతున్నది. అరోరా స్టేషన్‌గా పిలుస్తున్న ఈ హోటల్ 2021 కల్లా పూర్తి కానుంది. 2022 నుంచి టూరిస్టులను ఆహ్వానించనుంది. ఓరియన్ స్పాన్ అనే స్టార్టప్ కంపెనీ ఈ అరోరా స్టేషన్‌ను స్పేస్‌లో నిర్మిస్తున్నది. ఓ పెద్ద ప్రైవేట్ జెట్ క్యాబిన్ ఎంతుంటుందో అంత స్థలంలో ఈ లగ్జరీ హోటల్‌ను నిర్మిస్తున్నారు. ఈ హోటల్‌లో ఒకసారి గరిష్ఠంగా ఆరుగురు మాత్రమే ఉండే చాన్సుంది. అందులో ఇద్దరు క్రూ మెంబర్స్ ఉంటారు. 12 రోజుల పాటు ఉండొచ్చు.

ఇది భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. ప్రతి రోజూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూసే వీలుంటుంది. వినడానికే ఎంత అద్భుతంగా ఉందో కదా. కానీ అందులో ఉండటానికి అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ తింటారు. ఈ అరోరా స్టేషన్‌లో ఉండటానికి ఒక్కో వ్యక్తికి రూ.61,74,52, 500 వసూలు చేయనున్నారు. ఈ హోటల్లో ఉండాలనుకునేవాళ్లు ముందుగానే రూ.51,97,848 డిపాజిట్ చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని తర్వాత తిరిగిస్తారు. ఈ హోటల్‌ను నిర్మిస్తున్న ఓరియన్ స్పాన్ అనే స్టార్టప్‌కు హూస్టన్, సిలికాన్ వ్యాలీలలో ఆఫీస్‌లు ఉన్నాయి. అంతరిక్షలో శాశ్వతంగా మనుషుల కోసం కాలనీలు ఏర్పాటు చేయాలన్నది ఈ స్టార్టప్ లక్ష్యం.

  •  
  •  
  •  
  •  

Comments