కాంగ్రెస్ కు మరో దెబ్బ.. రేవంత్ కు నోటీసులు!

Wednesday, September 12th, 2018, 04:23:27 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మాములుగా లేదు. అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకముందు మరోవైపు నేతల ప్రచారాలు అలకలు యుద్దాలు మొదలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరి దారుణంగా మారింది. ముందస్తు ఎన్నికలకు పొత్తుల విషయంలో చర్చలు జరపాలని అనుకునే లోపే కేసుల దెబ్బలు ఒక్కొక్కటిగా తగులుతున్నాయి.

అక్రమ రవాణా కేసుల విషయంలో సంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టు కాగా అది మరువకముందే ఆయుధ చట్టం కింద గండ్ర వెంకటరమణా రెడ్డి సోదరులపై కేసుతో మరో షాక్ తగిలింది. ఇక ఇప్పుడు మరో కాంగ్రెస్ కీలక నాయకుడు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి.
జూబ్లీహిల్స్‌ పోలీసులు రేవంత్‌ రెడ్డికి బుధవారం మధ్యాహ్నం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే అందరూ ఊహించినట్టుగా ఓటుకు నోటు కేసు సంబందించినది కాకుండా జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ అవకతవకల కేసులో రేవంత్ కి నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో 13 మందికి కూడా నోటీసులు అందాయి. తప్పుడు డాక్యుమెంట్స్ తో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు జరిపారంటూ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. 2003 – 2005 వరకు ఉన్న కమిటీకి సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేశారు. ఇక 15 రోజుల్లోగా కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఎన్నికల దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని రేవంత్ కోర్టుకు లేఖ రాశారు.

  •  
  •  
  •  
  •  

Comments