టీడీపీ నేతలపై కౌంటర్లు వేసిన రేవంత్ రెడ్డి

Wednesday, October 18th, 2017, 07:10:40 PM IST

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీ టీడీపీ నేతలపై కూడా కౌంటర్లు వేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్ లో రేవంత్ చేరుతున్నారని వచ్చిన వార్తలను ఖండించిన ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎక్కువగా ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. అలాగే కేసీఆర్ పై కూడా ఆరోపణలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ యనమల రామకృష్ణుడికి కేసీఆర్ రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పరిటాల సునీత కొడుకు అలాగే పయ్యావుల అల్లుడు ఆధ్వర్యంలో నడుపుతున్న బార్ కు లైసెన్స్ ఎలా ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. ఇక కేసీఆర్ పై యనమల ఈగ కూడా వాలనివ్వరు అని చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ నేతలు మాత్రం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా చేసినవని పార్టీకి ఆయన కామెంట్స్ కి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.