టీడీపీకి కోలుకోలేని దెబ్బేసిన రేవంత్ రెడ్డి..!!

Tuesday, October 17th, 2017, 05:04:06 PM IST

తెలుగు దేశం పార్టీ తెలంగాణాలో ఇక కోలుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీకి భారీ షాక్ ఇచ్చేలా కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసమే ఆయన గత రెండురోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో రేవంత్ కాంగ్రెస్ లో కలిసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా రెవంత్ పదవి ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోయితోందనే అసంతృప్తి రేవంత్ రెడ్డిలో ఉందని అందుకోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలు అంటున్నాయి. రేవంత్ చేరికపై త్వరలోనే ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూనే దళిత నేతని టిపిసిసి చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో టిడిపి చతికిల బడింది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారం లో చిక్కుకున్న తరువాత టీడీపీ ప్రభావం మరింతగా తగ్గింది. నేతలంతా టిఆర్ఎస్ వైపు క్యూ కట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని సమాచారం అందుతున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.