కేసీఆర్ ప్రసంగంపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు!

Sunday, September 2nd, 2018, 10:05:53 PM IST

టీఆరెస్ పార్టీ ఎంతో వైభవంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ మొత్తానికి సక్సెస్ అయ్యింది. కొన్ని అంతరాయాలు ఏర్పడినప్పటికీ నేతలు ప్రణాళికతో సభను బాగానే నడిపించారు. అయితే ఈ సభపై ముందు నుంచి విమర్శలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు సభ అనంతరం ఇంకాస్త డోస్ పెంచారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలని ఆయన ప్రసంగంపై మాటల తూటాలు కురిపించారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో నాయకుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రసంగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చిడిలానే ఉందని మండిపడ్డారు. కేసీఆర్ మాటల్లో చేతల్లో వాడి వేడి తగ్గిందని చెబుతూ ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోందని చెప్పారు. ఇక సభలో కేసీఆర్ ఏ విషయంపైనా కూడా స్పష్టత ఇవ్వలేదని మిగులుడు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు దివాల తీసిందని అన్నారు. అదే విధంగా టీఆరెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి మ్యేనిఫెస్టో లోని ఏ అంశాలు కూడా నెరవేరలేదని, నష్టం వస్తే కాంగ్రెస్ చేసిందని లాభం వస్తే టీఆరెస్ పార్టీ చేసిందనడం కేసీఆర్ కు బాగా అలవాటైందని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments