చంద్రబాబు వచ్చేంత వరకు మాటల్లేవ్ : రేవంత్ రెడ్డి

Thursday, October 26th, 2017, 08:28:21 AM IST


గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వివాదం ఇప్పుడు తార స్థాయికి చేరింది. కొన్నేళ్లుగా టీడీపీలో కీలక నేతగా సాగిన ఆయన పై ఇప్పుడు ఇరు రాష్ట్రాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఏ విధమైన అలజడి చెలరేగుతుందా అని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రేవంత్ తెలుగుదేశం నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఏల్. రమణ కూడా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కు సమాచారాన్ని అందించడంతో ఆయన రేవంత్ పై ఆంక్షలు విధించారని పార్టీ తరపున ఎటువంటి కార్యక్రమాలను రేవంత్ నిర్వహించవద్దని తెలిపారు. కానీ రేవంత్ మాత్రం ఆ మాటలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గారికి తన మీద నమ్మకం ఉందని రేపు జరగనున్న టీడీఎల్పీ సమావేశం యథావిధిగా కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతే కాకుండా చంద్రబాబు వచ్చేంత వరకు ఎవరితోనూ మాట్లాడనని చెప్పారు. ఇక శాసనసభా వ్యవహారాల్లో ఎవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని గట్టిగా చెప్పారు.