డ్యామేజ్ మొత్తం జరిగాక ఈ ట్విస్ట్ ఏంటి రేవంత్ !

Sunday, October 22nd, 2017, 09:57:37 PM IST

రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల వలన టి టీడీపీలో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైపోయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో టీ టీడీపీ నేతలంతా ఆయన పై కారాలు మిరియాలు నూరారు. పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఇంకో అడుగు ముందుకేసి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పార్టీని బ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరబోతున్నాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇన్ని రోజులు స్పందించని రేవంత్ రెడ్డి నేడు మీడియా ముందుకు వచ్చి ఆశ్చర్య కరమైన ప్రకటన చేశారు. తన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని రేవంత్ ప్రకటన చేశారు. తన పై, పార్టీపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ నేతలని కార్యకర్తలని అయోమయానికి గురిచేస్తున్నారని రేవంత్ అన్నారు. 24 న జరిగే టీడీఎల్పీ సమావేశంలో పాల్గొని అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. విదేశీ పర్యటనల నుంచి వచ్చాక అధినేత చంద్రబాబు పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి వివరిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తానికి ఇన్నిరోజులు జరిగిన హైడ్రామాకు రేవంత్ ఈ విధంగా ముగింపు పలికారు.

  •  
  •  
  •  
  •  

Comments