కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన రేవంత్ ?

Monday, January 29th, 2018, 10:38:48 AM IST

మాజీ టీడీపీ నేత ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై తనదైన శైలి లో విమర్శలు చేస్తుంటారు రేవంత్ రెడ్డి. మొన్నఆ మధ్య గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ను కాళేశ్వరం చంద్ర శేఖరరావు అనే పేరుతో పొగుడుతూ పిలవగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు ఒక కొత్త పేరు పెట్టారు.అయితే అది పొగుడుతూ కాదు వ్యంగ్యంగా ‘కచరా’, అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే పేరుని ఆయన కుందించి మూడుముక్కలుగా విభజించి కచరా అని పిలవసాగారు. ఆదివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఎన్ డి ఎస్ ఎల్ కర్మాగారాల పునరుద్దరణకు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1.50 లక్షలకోట్ల బడ్జెట్ తో రాష్ట్రాన్ని నడిపిస్తున్నామన్న కేసీఆర్ అప్పుల్లో కూరుకుపోయి అల్లల్లాడుతున్న రైతులను మాత్రం ఏవిధంగా ఆదుకుంటారా చెప్పడంలేదని మండిపడ్డారు. కేసీఆర్ కు ఎన్ డి ఎస్ ఎల్ కర్మాగారాలను నడిపించే శక్తీ లేదా అన్నారు. టీఆరఎస్ కుటుంబ పార్టీ అని, కుటుంబ సభ్యులకు అన్ని మంత్రిపదవులు కట్టబెట్టిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కవితల పైన ఆయన విమర్శల చేశారు. గవర్నర్ నరసింహన్ గుడిబాట వీడి పొలం బాట పడితే క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాలన ఎలావుందో తెలుసుకోవచ్చన్నారు. మరోవైపు పిసిసి చీఫ్ ఉత్తమ్ కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. ఆయనను దురహంకారి అన్న ఉత్తమ్, ఆయన ప్రజాపాలన పూర్తిగా వదిలేసి, తనపై విమర్శలు చేసినవారిమీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని, 500 కోట్లతో నిర్మించిన ప్రగతి భవన్ లో కేసీఆర్ హాయిగా గడుపుతుంటే , అటు కుమారుడు కేటీఆర్ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తున్నారని. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించడం ఖాయమన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కి రోజుకో రకమైన పేరు పెట్టి విమర్శిశేతున్న నేతలకు ఆయన నుండి, ఆ పార్టీ నుండి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి..