టీడీపీకి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్..!

Friday, January 19th, 2018, 01:00:34 AM IST

తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు ఎవరికీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ లలో కేసీఆర్ వ్యతిరేకులు, అనుకూలులు ఇద్దరూ ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే సైకిల్ కారుగా రూపాంతరం చెందింది. దీనిని మనసులో పెట్టుకునే టి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో టీడీపీ అంతరించి పోతోందనే మాటలు వింటుంటే భాదగా ఉందని అన్నారు. కనీస గౌరవం అయినా కాపాడుకోవాలంటే టి టీడీపీని టిఆర్ఎస్ లో విలీనం చేయాలని అన్నారు. మోత్కుపల్లి వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర గందరగోళాన్ని రేపాయి. ఈ మధ్య కాలం నుంచి టిఆర్ఎస్ తో పొత్తుకు అనుకూలంగా మోత్కుపల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేడు ఆయన తన మనసులోనే భావాన్ని బయటపెట్టేశారు.

ఇటీవలే రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించారు. టీడీపీని విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేయాలని అన్నారు. టీడీపీ కాంగ్రెస్ కు వ్యతిరేకం అనే వాదనకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. అసలు టీడీపీని నాశనం చేసిందే కేసీఆర్. అలాంటిది టిఆర్ఎస్ లో విలీనం చేయాలనే మోత్కుపల్లి వ్యాఖ్యలు అర్థం లేనివని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు మొత్తం ఏకం కావలసిన తరుణం ఇది అని రేవంత్ అన్నారు. టి టిడిపి నేతలంతా ఎటువెళ్లడానికి నిర్ణయించుకున్నా పరవాలేదు. కానీ ఆపార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ లో చేరాలని పిలుపునిచ్చారు.