రేవంత్‌రెడ్డి అల‌క.. కాంగ్రెస్‌తో క‌టీఫ్‌?

Saturday, November 10th, 2018, 10:12:08 AM IST

కూట‌మి వ‌ర్గాల‌ సీట్ల‌ కుమ్ములాట‌లు కాంగ్రెస్‌లో చిచ్చుకు కార‌ణ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. కూట‌మి కార‌ణంగా తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు దూరం అవుతున్నారా?. ఈ వార్త ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇటీవ‌ల ఇన్‌డైరెక్ట్‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం, కూట‌మి పంప‌కాల కార‌ణంగా త‌న వ‌ర్గానికి టికెట్‌లు ఇప్పించ‌కోలేకపోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీని వీడాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరే స‌మ‌యంలోనే పార్టీ అదిష్టానానికి భారీ కోరిక‌ల చిట్టాను వినిపించాడ‌ని, త‌న‌కు పార్టీలో స‌ముచిత స్థానం, త‌న వ‌ర్గాల‌నికి కోరిన టికెట్‌లు, ప‌ద‌వులు ఇవ్వాల‌న్న‌ది రేవంత్ కోరిక‌ల చిట్టా. దీన్ని అంగీక‌రిస్తేనే పార్టీలో చేర‌తాన‌ని ష‌ర‌తు పెట్ట‌డం, దానికి కాంగ్రెస్ పెద్ద‌లు అంగీక‌రించ‌డం వ‌ల్లే రేవంత్ కాంగ్రెస్‌లో చేరాడ‌ట‌. కానీ తాను చెప్పిన శ‌ర‌తుల్లో ఏదీ నెర‌వేర‌లేద‌ని, చివ‌రికి త‌న వ‌ర్గానికి చెందిన వారికి టికెట్ కూడా ఇప్పించ‌లేని ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో రేవంత్ అల‌క‌బూనిన‌ట్టు చెబుతున్నారు. అంతే కాకుండా సీట్ల విష‌యంలో పీసీసీ నేత ఉత్త‌మ్‌కు, రేవంత్‌కు చెడింద‌ని ప్ర‌చారం జోరందుకుంది. రేవంత్ త‌న అనుచ‌ర వ‌ర్గ‌మైన సీత‌క్క (ములుగు నియోజ‌క‌వ‌ర్గం), వ‌రంగ‌ల్ వెస్ట్ (న‌రేంద‌ర్‌రెడ్డి), నిజామాబాద్ రూర‌ల్ (అరికెల న‌ర్సారెడ్డి), ఆర్మూర్ (రాజారామ్ యాద‌వ్‌), ఎల్లారెడ్డి (సుభాష్‌రెడ్డి), దేవ‌ర‌కొండ (బిల్లా నాయ‌క్‌), ఇల్లందు (హ‌రిప్రియ‌), సూర్య‌పేట (ప‌టేల్ ర‌మేష్‌రెడ్డి), చెన్నూరు (బోడ జ‌నార్థ‌న్‌) ల‌కు టికెట్‌లు కేటాయించాల‌ని రేవంత్ కోర‌డం, ఆందులో కొంత మందిని అదిష్టానం తిర‌స్క‌రించ‌డంతో పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం మొద‌లైంది. ఈ ప్ర‌చారంలో ప‌సలేద‌ని రేవంత్ కొట్టిపారేశాడు.