సమీక్ష : ‘గోవిందుడు అందరివాడేలే’ – మనసును హత్తుకునే కుటుంబ కథా చిత్రం.

Thursday, October 2nd, 2014, 12:21:28 PM IST
govindu-andari-vadu విడుదల తేదీ : 01 అక్టోబర్ 2014
నేటిఎపి. కామ్ రేటింగ్ : 3.75/5
దర్శకత్వం : కృష్ణవంశీ
నిర్మాత : బండ్ల గణేష్
సంగీతం : యువన్ శంకర్ రాజా 
నటీనటులు : రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, రెహమాన్ తదితరులు.

కెరీర్ ఆరంభం నుండి పక్కా కమర్షియల్ సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్న హీరో రామ్ చరణ్. వెండితెరపై కమ్మనైన తెలుగుధనానికి, సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కరించే సినిమాలకు పెట్టింది పేరు సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశి. ప్రతి సన్నివేశంలో పర్ఫెక్షన్, ఆర్టిస్టుల నుండి అత్యుత్తమ నటన రాబడతారని పేరు. వీరిద్దరి కలయికలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రారంభమైనప్పుడు… రామ్ చరణ్ ఎలా నటిస్తాడో..? కృష్ణవంశి సినిమాను ఎలా తీస్తాడో..? సగటు సినిమా ప్రేక్షకులలో, మెగా అభిమానులలో మెదలైన తొలి ప్రశ్న ఇది. టీజర్ విడుదల కార్యక్రమంలో కృష్ణవంశి ఎమోషనల్ స్పీచ్…. ట్రైలర్, ప్రోమోలలో రామ్ చరణ్ న్యూలుక్, నటన.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై భారి తారాగణంతో బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈ రోజు, అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల ప్రశ్నలకు సమాధానం లభించిందా..? అంచనాలను అందుకుందా..? తెలియాలంటే ఈ సమీక్ష ఒకసారి చదవండి. 

కథ :

లండన్ లో స్థిరపడ్డ తెలుగు డాక్టర్ చంద్రశేఖర్ (రెహమాన్)కు ప్రతిష్టాత్మక మేరీ యూనివర్సిటీ డీన్ పదవి వరిస్తుంది. అతని కుమారుడు అభిరామ్ (రామ్ చరణ్), ఇతర తెలుగువారు చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. అయితే చివరి క్షణంలో వేరే వ్యక్తికి డీన్ పదవి కట్టబెడతారు. అప్పుడు చంద్రశేఖర్ కుమారుడికి తన గతం గురించి చెప్తాడు. తన తండ్రి బాలరాజు(ప్రకాష్ రాజ్)కు చేసిన అన్యాయం వల్లనే తనకి తగిన శాస్తి జరిగిందని అంటాడు.

చంద్రశేఖర్ తండ్రికి చేసిన అన్యాయం ఏంటి..? లండన్ లో పుట్టి పెరిగిన అభిరామ్ తండ్రి కోసం మారుమూల గ్రామానికి వచ్చిన అభిరామ్ ఏం చేశాడు..? బాబాయి బంగారి (శ్రీకాంత్) అభిరామ్ ను ఎందుకు కొట్టాడు..? తన తాతయ్య కుటుంబం కోసం అభిరామ్ ఏం చేశాడు..? అభిరామ్ తన మనవడు అని తెలిసిన తర్వాత బాలరాజు స్పందన ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వెండితెరపై అందంగా ఆవిష్కరించే కృష్ణవంశీ మరోసారి తన మార్క్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం, రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ లతో పాటు ఇతర ఆర్టిస్టుల నటన, యువన్ శంకర్ రాజా సంగీతం, నేపధ్య సంగీతం, బండ్ల గణేష్ నిర్మాణ విలువలు మేజర్ ప్లస్ పాయింట్స్. పాటల్లో తెలుగుదనం, తెరపై నిండుదనం, మనసును హత్తుకునే భావాలు, హృదయపు లోతుల్లో మనల్ని కదిలించే, మన కుటుంబంలో జరుగుతున్నట్టు అనిపించే సన్నివేశాల కలబోత ‘గోవిందుడు అందరివాడేలే’.

తొలిసారిగా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంలో నటించిన రామ్ చరణ్..  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో అద్బుతంగా నటించాడు. తన స్టైల్, కాస్ట్యూమ్స్, నటన దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో కొత్తదనం చూపించాడు. ఒకే తరహా సినిమాలతో మూసలో వెళ్తున్నాడు అని విమర్శించే వారికి ఈ సినిమాతో సమాధానం చెప్పాడు. తనలో నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని అందరివాడు అయ్యాడు. సరికొత్త రామ్ చరణ్ ను మీరు చూస్తారు. తన చందమామ కాజల్ అగర్వాల్ ను ఈ సినిమాలో మరింత సౌందర్య దేవతగా చూపించారు కృష్ణవంశీ. అందం, అభినయంతో ఆకట్టుకుంది. పాటల్లో ఆమె గ్లామర్ అదరహో.. నటిగా, గ్లామరస్ హీరోయిన్ గా కాజల్ కెరీర్ లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

చరణ్ తాతయ్య పాత్రలో ప్రకాష్ రాజ్, తానూ మాత్రమే ఆ పాత్రలో నటించగలను అనే రీతిలో జీవించారు. నటుడిగా ప్రకాష్ రాజ్ ప్రతిభ ఎప్పుడో ప్రేక్షకులకు తెలిసింది. ఈ సినిమాతో మరోసారి తనను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. పక్కా పల్లెటూరి యువకుడి పాత్రలో శ్రీకాంత్ కుమ్మేశాడు. ఫన్నీ డైలాగులుతో నవ్వించాడు. ప్రకాష్ రాజ్ సరసన జయసుధ, కమలిని ముఖర్జీని, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, రెహమాన్, ఆదర్శ బాలకృష్ణ ఇలా ప్రతి ఒక్కరు అద్బుతమైన నటన కనబరిచారు. కనబరిచారు అనడం కంటే వారి నుండి కృష్ణవంశి రాబట్టుకున్నాడు అనడం సబబు.