రివ్యూ : నన్ను దోచుకుదువటే – రొమాంటిక్ డ్రామా

Friday, September 21st, 2018, 06:42:32 PM IST

యువహీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుదీర్ బాబు సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి తానే హీరోగా నన్ను దోచుకుందువటే సినిమా నిర్మించాడు. సినిమాకు మంచి ప్రమోషన్ కూడా చేసి క్రేజ్ పెంచాడు. ఆర్ఎస్.నాయుడు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేడు విడుదలైంది. ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
కార్తీక్ (సుదీర్ బాబు) ఒక డ్రీమ్ కోసం ఎంతో కష్టపడే వర్క్ – మైండెడ్ ఎంప్లాయ్. అమెరికా వెళ్లి ఎంతో సాధించాలని కలలు కంటూ ప్లాన్ చేసుకుంటుంటాడు. అయితే ఈ తరుణంలో అతని ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. వాటి నుంచి తప్పించుకోవడానికి కార్తీక్ మేఘన (నభ నటేష్)అనే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెబుతాడు. కొన్ని పరిణామాల అనంతరం వారి స్నేహం కాస్త ప్రేమాగా మారుతుంది. ఈ తరుణంలో ఊహించని విధంగా కార్తీక్ మేఘనను దూరంగా పెట్టాలని అనుకుంటాడు. కార్తీక్ అసలు మేఘనకు ఎందుకు దూరంగా ఉంచాల్సి వస్తుంది? దాని వెనుకున్న అసలు కారణమేంటి? అసలు కార్తీక్ యూఎస్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? చివరికి ప్రధాన జంట ఎలా కలుసుకుంటారు అనేది అసలు కథ.

విశ్లేషణ :

సినిమాలో కథానాయకుడు సుదీర్ బాబు తన పాత్రకు తగ్గట్టుగా సరైన న్యాయం చేశాడనే చెప్పాలి. ఒక వర్క్ – మైండెడ్ ఎంప్లాయ్ ఎలా ఉంటాడు అనేది తనదైన శైలిలో సాధారణ ప్రేక్షకులకు సైతం అర్ధమేయ్యేలా నటించాడు. ఇక కొత్త అమ్మాయి నభ నటేష్ కూడా తన పాత్రతో సరికొత్తగా మెప్పించింది. తన లవ్లీ పెర్ఫామెన్స్ తో తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కుర్రాళ్ళ మనసుల్ని దోచేసుకుందని చెప్పవచ్చు. మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న నటిలా చక్కని అభినయంతో మెప్పించింది. కీలకమైన సన్నివేశాల్లో కూడా ఆమె నటన బాగానే ఆకట్టుకుంది. ఇక దర్శకుడు ఆర్ఎస్.నాయుడు విషయానికి వస్తే అతనికి ఇది మొదటి సినిమా. నాయుడు పెద్దగా ప్రయోగాలు చేయకుండా సేఫ్ జోన్ లో కథను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడిపించడానికి ట్రై చేశాడు. అతను కథను చూపించిన విధానం బావుంది. అయితే మొదటి భాగంలో ఉన్నంత ఆసక్తి రెండవ భాగంలో అంతగా ఉండదు. ఫస్ట్ హాఫ్ లో సరదా సన్నివేశాలతో సరికొత్తగా అనిపించినా సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం అంచనాలను అందుకోలేదు. కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ సీన్ లను తెరకెక్కించడంలో దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది. ఇక కమెడియన్ వైవా హర్ష, సుదర్శన్ – షణ్ముఖ్ వారి పాత్రలతో ఫస్ట్ హాఫ్ మంచి కామెడీని పండించారు. సీనియర్ యాక్టర్ నాజర్ తన పాత్రలో పర్ఫెక్ట్ గా నటించారు. ఇక హీరోయిన్ తల్లిగా నటించిన తులసి కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాటలు విజువల్స్ పరంగా ఒకే.

ప్లస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్

నభ నటేశ్ స్క్రీన్ ప్రజెన్స్

వైవా హర్ష అండ్ గ్యాంగ్ కామెడీ ఎపిసోడ్లు

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం

ఎమోషనల్ సీన్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోవడం

తీర్పు :

మొత్తంగా నన్ను దోచుకుందువటే సినిమా సింపుల్ అండ్ గుడ్ లవ్ స్టోరీగా మెప్పించిందని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సున్నితమైన సన్నివేశాలు రిఫ్రెషింగ్ లవ్ సీన్స్ ప్రేక్షకులను సరికొత్తగా మెప్పిస్తాయి. హీరోయిన్ నబ నటేష్ స్క్రీన్ ప్రజెన్స్ అలాగే తన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కానీ సినిమా కథ నెమ్మదిగా సాగడం సెకండ్ హాఫ్ లో సాగదీసినట్లు అనిపించడం ఆడియెన్స్ కి అంతగా నచ్చవు. ఇక సింపుల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా నన్ను దోచుకుందువటే సినిమాకు వెళితే ఈ వీకెండ్ లో ఒక మంచి సినిమా చుసిన అనుభూతి కలుగుతుంది.

 

Netiap.com Rating : 3/ 5