రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : నిర్మలా కాన్వెంట్ – రోషన్ భలే ఉన్నాడు..!!

Sunday, September 18th, 2016, 10:30:41 AM IST

nirmala-convent
తెరపై కనిపించిన వారు : రోషన్, శ్రేయా శర్మ..
కెప్టెన్ ఆఫ్ ‘నిర్మలా కాన్వెంట్’ : జీ నాగ కోటేశ్వరరావు

మూల కథ :

నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్లో చదువుకునే సామ్యూల్ (రోషన్), శాంతి (శ్రేయా శర్మ) ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన శాంతి కుటుంబానికి ఈ విషయం తెలిసి వీరిద్దరినీ విడదీస్తారు. ఆ తర్వాత తన ప్రేమను గెలిపించుకోడానికి సామ్యూల్ ఏం చేశాడన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాయే అయినా రోషన్ సునాసయంగా నటించేశాడు. చూడ్డానికి ఎంతో బాగున్న ఈ టీనేజ్ హీరో, యాక్టింగ్, డ్యాన్సుల్లోనూ మంచి ప్రతిభ చూపించి రానున్న కాలంలో హీరోగా నాకూ ఓ స్థానం ఉంటుందన్నట్టు ఓ సంకేతం ఇచ్చేశాడు. రోషన్‌కు విజిల్స్ వేసుకోవచ్చు.

2. శ్రేయా శర్మ చాలా క్యూట్‌గా ఉంది. ఎంత క్యూట్‌గా ఉందంటే ఆ అమ్మాయి తెరపై కనిపిస్తే నిండుగా వెలిగిపోయేలా. ఆ అమ్మాయికీ విజిల్స్ వేసుకోవచ్చు.

3. సెకండాఫ్‌లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాక సినిమాలో మంచి ఊపు వచ్చింది. నాగార్జున తన రియల్ లైఫ్ రోల్‌లో ఇప్పటికీ అదే జోరుతో కనిపించడం ఆశ్చర్యమే! ఆయనకు ఎన్ని విజిల్స్ వేసినా సరిపోవు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. నిర్మలా కాన్వెంట్ అసలు కథ ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూసినది కావడం ఇక్కడ అసలైన ఢమ్మాల్ పాయింట్. ఒక సంపన్న అమ్మాయి, పేదింటి అబ్బాయిని ప్రేమించడం, అమ్మాయి తరపు వాళ్ళు కాదనడం, హీరో చాలెంజ్ చేయడం ఇవన్నీ రొటీన్‌గా కనిపించి ఢమ్మాల్ అనిపిస్తాయి.

2. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల ప్రేమకథ కూడా సాధారణంగా ఉంది. అందులో ఎమోషన్ అన్నది పెద్దగా కనిపించింది లేదు. ఇది కూడా ఢమ్మాల్ పాయింటే!

3. ఇక నాగార్జున చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ అన్న గేమ్ షో కూడా ముందే ఊహించగలిగేంత సాదాసీదాగా ఉంది. ఈ విషయంలో కాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది.

దావుడా – ఈ సిత్రాలు చూసారా.!!

–> ఒక పదహారేళ్ళ కుర్రాడు ఓ రాజ వంశ కుటుంబీకులను సవాల్ చేయడమన్నది సినిమా వరకు కూడా కొన్నిసార్లు మాత్రమే బాగుంటుంది. ఇందులో ఈ ఛాలెంజ్ స్థాయి దాటి మరీ ఓవర్ అవ్వడం చిత్రమే!

–> ఒక టీనేజ్ కుర్రాడు, “నాన్నా నేనొక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయితో పెళ్ళి జరిగేలా చూడు” అని అడిగితే ఆ తండ్రి వెళ్ళి నిజంగానే అమ్మాయిని అడగడం చిత్రమే!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : ఒరేయ్ బాబూ రోషన్ భలే ఉన్నాడు కదరా! ఐదేళ్ళయితే దుమ్మురేపుతాడనేలా ఉన్నాడు.
మిస్టర్ బి : అదే అదే.. రోషన్ కాకుండా సినిమాలో అంత బాగా ఇంకేం ఉందో చెప్పు?
మిస్టర్ ఏ : (సైలెంట్)