రివ్యూ: నోటా – విజయ్ ఈ సారి ఆకట్టుకోలేదు

Friday, October 5th, 2018, 04:27:22 PM IST

‘అర్జున్ రెడ్డి’తో స్టార్ స్టేటస్ సంపాదించుకొని.. ‘గీతగోవిందం’తో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. దీంతో విజయ్ తాజా చిత్రం “నోటా” పై అంచనాలు అమాంతంగా పెరిగాయి. కాగా పొలిటికల్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కిన ‘నోటా’ చిత్రం ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ అయి.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో వెళ్లి చూద్దాం.

కథ:

సీఎం వాసుదేవన్ (నాజర్) కుమారుడైన వరుణ్ (విజయ్ దేవరకొండ)కి రాజకీయాల అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే వీటిన్నిటికీ దూరంగా లండన్ వెళ్లిపోతాడు. కానీ వాసుదేవన్ (నాజర్) కొన్ని కారణాల రిత్యా వరుణ్ ని సడెన్ గా అర్ధరాత్రి ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు. అసలు వాసుదేవన్ ఏ కారణాల చేత వరుణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించాడు ? అలా ప్రకటించడం వెనక వాసుదేవన్ ఎజండా ఏమిటి ?
రాజకీయాల అంటే ఏ మాత్రం ఆసక్తి లేని వరుణ్ ముఖ్యమంత్రిగా ఎలా పని చేశాడు ? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏమిటి ? చివరకి యువ ముఖ్యమంత్రిగా వరుణ్ ఏమి సాధించాడు ? ఆ సాధించే క్రమంలో వరుణ్ కి, మహేంద్ర (సత్యరాజ్) ఏ విధంగా సాయపడ్డాడు ? వాసుదేవన్ కి శత్రువు అయిన మహేంద్ర, వాసుదేవన్ కొడుకు అయిన వరుణ్ కి, అసలు ఎందుకు సపోర్ట్ చేస్తుంటాడు ? ఈ రాజకీయ చదరంగంలో చివరికి వరుణ్ ఎలా నెట్టుకొచ్చాడు ?లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే, నోటా చిత్రాన్ని చూడాల్సిందే.

విశ్లేషణ:

విజయ్ దేవరకొండ ఇప్పటివరకు వైవిధ్యభరితమైన మరియు ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకున్నాడు. కానీ ఈ సారి అలాంటి కథను ఎంచుకోలేకపోయాడు. పాత చింతకాయ పచ్చడిలాంటి చూసేసిన సన్నివేశాలు మరియు అంతగా ఆసక్తిగా సాగని కథ కథనాలతో కూడిన చిత్రం కావడంతో విజయ్ దేవరకొండకి ఈ సారి ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. కానీ విజయ్ ఓ యంగ్ సీఎం గా చాలా బాగా నటించాడు. తన టైమింగ్‌ తో అక్కడక్కడా.. తన మార్క్ కామెడీతో నవ్విస్తూనే.. ఇటు సీరియస్ పెర్ఫార్మెన్స్ తోనూ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యరాజ్ తన నటనతో పొలిటికల్ డ్రామా సీన్స్ లో చాలా బాగా నటించారు. సీఎం నటించిన నాజర్ తన గాంభీరమైన నటనతో ఆకట్టుకుంటారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాల పై మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేకపోయారు. ఆయన సినిమాని తీర్చిదిద్దిన తీరు.. మరియు కొన్ని కొన్ని సన్నివేశాల వలన, సినిమా పూర్తిగా దారి తప్పింది. ఫస్టాఫ్ లో విజయ్ ఒక రౌడీ ముఖ్యంమత్రిగా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినా.. మిగిలిన సన్నివేశాలు మాత్రం విసిగిస్తాయి. దీనికి తోడు సెకండాఫ్ కూడా పేలవమైన నేరేషన్ తో.. సాగతీత సీన్లతో ప్రేక్షకులను తీవ్రమైన గందరగోళానికి గురి చేస్తాయి.

మొదటి సగం సాగినంత ఉత్కంఠభరితంగా రెండో సగం సాగకపోవడంతో ఈ చిత్రానికి పెద్ద స్థాయిలో దెబ్బ తగిలిందనే చెప్పాలి. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు తమిళ్ చిత్రాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. నాజర్, సత్యరాజ్ ల మధ్య ప్లాష్ బ్యాక్ మరియు చివర్లో సత్యరాజ్ రివీల్ చేసే ట్విస్ట్ కూడా ఆడియన్స్ కి ముందే తేలిసిపోతుంది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

ప్లస్ పాయింట్స్ :

కథాంశం
విజయ్ దేవరకొండ నటన,
సత్యరాజ్, నాజర్ నటన.
కథాంశాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

ఆసక్తిలేని కథ
ఆకట్టుకొని కథనం
పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
తమిళ నేటివిటీ ఎక్కువవ్వడం.
సినిమాలో సరైనా కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం.

తీర్పు:

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘నోటా’ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రాజకీయాల్లోని ఎత్తుగడలను, సమస్యలను ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో దర్శకుడు ఆనంద్ శంకర్ విఫలం అయ్యాడు. పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకున్నా… ఈ ‘నోటా’ చిత్రం మాత్రం నిరుత్సాహ పరుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిలౌవ్ యావరేజ్ చిత్రంగా నిలుస్తోంది.

 
Netiap.com Rating : 2.5/5