ఒక్కో ప్రశ్నకి ఒక్కో పంచ్ డైలాగ్.. ఆహా..క్లాప్సు.. విజిల్స్..!

Friday, October 13th, 2017, 08:25:37 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలంటే మా చెడ్డ మోజు. ఎంతటి వారినైనా తన సెటైర్లతో తికమక పెట్టగల నేర్పరి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నేపథ్యంలో వర్మకు తెలుగు దేశం పార్టీ నేతలకు మధ్య వార్ జరుగుతోంది. ఇటీవల మంత్రి సోమిరెడ్డి ఆర్జీవిని విమర్శించారు. హిట్టయ్యే సినిమాలు చేసుకుంటే వర్మకు మంచిదని సూచించిన సంగతి తెలిసిందే. స్కూల్ లో టీచర్ లా చాలా విలువైన విషయాలు చెప్పారని ఫీజు ఏ అడ్రెస్స్ కు పంపమంటారో తెలపాలని వర్మ సోమిరెడ్డికి కౌంటర్ వేశారు. తాజాగా అలాంటి పంచ్ డైలాగులే వర్మ ఎమ్మెల్యే అనిత పై పేల్చారు. ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా వర్మ సినిమా తీస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ ఎమ్మెల్యే అనిత వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో వర్మ కౌంటర్ వేశారు.

సోషల్ మీడియా వేదికగా వర్మ ఎమ్మెల్యే అనితకు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి..

ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు..

ఎమ్మెల్యే అనిత : ఎన్టీఆర్ పై వర్మ తీస్తున్న చిత్రం చరిత్రని వక్రీకరించే విధంగా ఉండకూడదు.

వర్మ జవాబు : అనిత గారు, బయటతెలిసిన చరిత్ర వెనుక దాగున్న అసలు చరిత్రని చూపించడమే నా ఉద్దేశం.

ఎమ్మెల్యే అనిత : వర్మ తీయబోయే సినిమాలో ఎన్టీఆర్ ప్రజలకు చేసిన మంచిని చూపించాలి.

వర్మ జవాబు : అనిత గారు, ఈ సినిమా బయోపిక్ కాదు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి మొదలవుతుంది.

ఎమ్మెల్యే అనిత : ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా సినిమా తీస్తే టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

వర్మ జవాబు : ఇలాంటి వార్నింగ్ లు టిడిపి పుట్టకముందు నుంచి వినీ వినీ విసుగెత్తిపోయాను.

ఎమ్మెల్యే అనిత : చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనలేకే వైసీపీ వాళ్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీస్తున్నారు.

వర్మ జవాబు : లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక

ఎమ్మెల్యే అనిత : చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టిడిపిని వైసిపి ఇబ్బంది పెట్టాలనుకుంటోంది. బ్రతికున్న జగన్ పై సినిమా తీస్తే ఆయన పాదయాత్ర కూడా చేయలేరు.

వర్మ జవాబు : అనిత గారు మీరు సూపరు.. నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ జావేద్ సలీంకి కానీ, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి కానీ వచ్చి ఉండదు.

ఎమ్మెల్యే అనిత : మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి.. అదే సమాజహితం

వర్మ జవాబు : ఆహా.. క్లాప్సు.. విజిల్స్