రోజాగారివి విమర్శలా లేక టీవీ సీరియల్ డైలాగులా !

Monday, February 11th, 2019, 09:31:21 AM IST

వైకాపా ఫెయిర్ బ్రాండ్ రోజా మాటల్లో వాడీ వేడి రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కొన్నిసార్లు లాజిక్కే లేకుండా మాట్లాడేస్తున్నారామె. ఎటు తిప్పీ ముఖ్యమంత్రిని, ఆయన పనుల్ని తిట్టిపోయడమే ఎజెండాగా పెట్టుకుని పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఈమధ్య ఆమె మాట్లాడిన స్పీచులు వింటే ఏవో టీవీ సీరియల్ డైలాగుల్లా అనిపిస్తాయి తప్ప న్యాయమైన విమర్శల్లా అనిపించవు.

తాజాగా చంద్రబాబు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడిన ఆమె పసుపు-కుంకుమ పథకం ద్వారా మహిళల ఓట్లు గుంజుకోవాలని బాబు ప్రయతిస్తున్నారని, ఇదంతా ఎన్నికల స్టంట్ అని అన్నారు. అంతవరకూ బాగానే ఉన్నా పసుపు, కుంకుమకు ఉన్న పవిత్రతను సిఎం పోగొడుతున్నారని, ఆయన్ను అన్న కాదు దున్న అనాలని అన్నారు. చివర్లో ఆ దున్న అనే తిట్టు ఎందుకో ఆమెకైనా తెలుసో లేదో.

వెయ్యి రూపాయల పింఛను సరిగ్గా ఇవ్వలేని బాబుగారు 2000 ఇస్తానని ఎలా అంటున్నారో అంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్న చంద్రబాబు 2000 ఇస్తానంటే నమ్మలేకపోతున్న రోజాగారు అధికారంలోకి వస్తామని, అప్పుడు 3000 పింఛను ఇస్తానని జగన్ అంటుండటం పట్ల ఎందుకు ఆశ్చర్యపోవట్లేదో. అంతేనా తిట్ల దండకం చివర్లో తన స్టైల్లో టీడీపీ నేతలంతా మీ ఇంట్లో ఆడవాళ్ళ తాళిబొట్టు మీద ఒట్టుపెట్టి పసుపు – కుంకుమ పథకం డ్రామా కాదని చెప్పగలరా అంటూ సీరియల్ డైలాగ్ వదిలి కట్ చేశారు.