అల్లూరిగా చరణే ఎందుకు? – వై నాట్ మహేష్ – క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

Thursday, March 14th, 2019, 05:33:36 PM IST

ఎంతకాలంగానో తెలుగు సినీపరిశ్రమతో పాటు యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌలి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో దానయ్య డీవీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ఆర్ఆర్ఆర్” తొలి ప్రెస్ మీట్ ఇవాళ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో సినిమా స్టోరీ లైన్ గురించి, హీరోల పాత్రలు, హీరోయిన్లు ఎవరన్నదాని గురించి క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. సినిమా కథ స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో ఉండబోతోందని, ఒకే ఇంచు మించు ఒకే కాలంలో పుట్టిన ఆంధ్రా, తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ కథకు శ్రీకారం చుట్టిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని, కొమరం బీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో విలేఖరులు రాజమౌళిని ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు, అల్లూరి సీతామరాజు అంటే తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ గుర్తొస్తారు కదా, ఈ సినిమాలో అల్లూరి పాత్ర కోసం మహేష్ బాబుని తీసుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇదే ప్రశ్న మహేష్ బాబు ఫ్యాన్స్ అడిగితే మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన రాజమౌళి మహేష్ బాబును ఆయన ఫ్యాన్స్ అల్లూరిగా కంటే జేమ్స్ బాండ్ తరహా పాత్రల్లో చూడటానికే ఎక్కువ ఇష్టపడతారని, ఈ మేరకు ఒక ఫంక్షన్ లో ఫ్యాన్స్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారని అన్నారు. మొత్తానికి మహేష్ అభిమానుల నుండి రాబోయే సమస్య నుండి తెలివిగా బయటపడ్డారు రాజమౌళి. స్టోరీ లైన్ రివీల్ చేసి అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేసిన రాజమౌళి పోను పోను ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తారో చూడాలి.