రోజురోజుకి పడిపోతున్న రూపాయి విలువ..ఐనా ఏం భయం వద్దంటున్న ప్రభుత్వం.

Wednesday, September 19th, 2018, 01:28:13 PM IST

గత కొద్దీ రోజులుగా రూపాయి విలువ యొక్క పరిస్థితి అస్సలేం బాగుండడం లేదు.రోజురోజుకి రూపాయి విలువ పై నుంచి పారుతున్న జలపాతంలా పడిపోతూనే ఉంది.ప్రస్తుతం డాలరుతో రూపాయి మారక ద్రవ్య విలువ 72 కి చేరుకుంది.ఒకప్పుడు డాలరుతో రూపాయి మారక విలువ 60కి పడింది అంటేనే భారతీయ స్టాక్ మార్కెట్టు లబోదిబోమంది ఇప్పుడు ఈ విలువ 73 నుంచి 75 కనిష్ట స్థాయికి పడిపోయినా కూడా పెద్ద ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

ఐతే రూపాయి విలువ ఇంతలా దిగజారిపోడానికి కొన్ని బలమైన కారణాలు కూడా లేకపోలేవు.వాణిజ్య పరంగా రెండు పెద్ద దేశాలు అయినటువంటి చైనా-అమెరికా మధ్య ఏర్పడుతున్న వాణిజ్య యుద్ధం,ముడి చమురు నిల్వల యొక్క ధరలు రోజు రోజుకి పెరిగిపోవడం అంతే కాకుండా డాలర్ల కొనుగోలు చేయడంలో కూడా పోటీ పెరగడం వంటివి రూపాయి విలువను పతనం కావడానికి దోహదపడుతున్నాయి అని ఆనంద్ రాఠీ షేర్స్ మరియు స్టాక్ రెసెర్చ్ నిపుణులు రుషబ్ మారు తెలియజేసారు.

ఐతే పడిపోతున్న రూపాయి విలువను ఎలా కట్టడి చెయ్యాలి అన్న అంశం మీద కూడా ఆర్బీఐ తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతి మరియు దిగుమతి దారులు కొంచెం జాగ్రత్త వహించి హెడ్జింగ్ చేసుకుంటే మేలని అభిప్రాయపడుతున్నారు.ఇదే సందర్భంలో రూపాయి విలువ ఇంతలా పతనం అవుతున్నా సరే పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా పోలేదని మన దేశ ప్రభుత్వం తెలుపుతుంది.దీనికి కారణం భారతీయ రిజర్వు బ్యాంకులో దాదాపు 28.8లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని,ఒకవేళ రూపాయి విలువ ఇంకాస్త పతనం ఐనా సరే వడ్డీ రేట్లను పెంచి పడిపోతున్న రూపాయి విలువను అదుపులో పెట్టొచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.