‘రిటైర్మెంట్’ వార్తలపై స్పందించిన సచిన్

Wednesday, September 4th, 2013, 03:25:57 PM IST

SACHIN-TENDULKAR
తన రిటైర్మెంట్ కు ఇంకా టైముందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటున్నాడు. 200వ టెస్టు తర్వాత రిటైర్ అవుతారన్న ఉహాగానాలకు తెరదించాడు మాస్టర్. కెరీర్ లో ఏనాడు తొందరపడలేదు. రిటైర్మెంట్ విషయంలోనూ తొందరపడనని బదులిచ్చాడు సచిన్. ‘రిటైర్మెంట్‌కు తొందరేముంది. నా కెరీర్ మొత్తంలో ఏనాడూ తొందరపడలేదు. ఇలానే ఉన్నా. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫార్ములా కూడా అదే’ అని సచిన్ తెలిపాడు. తాను దేవుడ్ని కాదని కేవలం క్రికెటర్‌ని మాత్రమేనని అన్నాడు. ‘ నేను భగవంతుడ్ని కాను. కేవలం క్రికెట్ ఆడతా. దేవుని ఆశీస్సుల వల్లే నా జీవితంలో ఇదంతా సాధించా. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు. నేను కూడా తప్పులు చేస్తా. చేయకపోతే ఎప్పుడూ అవుట్ కాను. కాబట్టి నా ఆట వరకు నేను ఆడతా. మ్యాచ్‌కు ముందు కొంత మేరకు సన్నద్ధమవుతా’ అని మాస్టర్ వెల్లడించాడు.

ఎన్నో వివాదాలతో ముడిపడి ఉన్న క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా అభిమానుల ఆశలను మోయడంపై స్పందిస్తూ.. ‘జీవితాన్ని చాలా సాధారణంగా ఉండేటట్లు చూసుకుంటా. నా స్కూల్ రోజుల నుంచి చాలా తక్కువగా సంబరాలు చేసుకునేవాణ్ని. ఏదైనా సాధిస్తే దేవుడికి మిఠాయి ఆఫర్ చేసేవాణ్ని. ఎలాగూ మ్యాచ్ గురించి ప్రజలు మాట్లాడుకుంటారు కాబట్టి నీవు ముందుకు సాగిపో అని నా సోదరుడు ఎప్పుడూ చెబుతుంటాడు. నాది సమతుల్యమైన జీవితం’ అని ఈ ముంబైకర్ పేర్కొన్నాడు. తన తండ్రి మరణంతో కఠినమైన దశను ఎదుర్కొన్నానని చెప్పాడు. ‘1999లో నా తండ్రిని కోల్పోయాను. ఇప్పటికి చాలా ఏళ్లయింది. సమయం దొరికినప్పుడు పాత జ్ఞాపకాలను రివైండ్ చేసుకుంటే మా తండ్రి గుర్తుకు వస్తారు. కానీ జరిగిన దాన్ని మార్చలేం కదా’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.

రిటైర్మెంట్ పై సచిన్ మాటలను బట్టీ చూస్తుంటే.. టెస్టుల్లో సచిన్ మరో ఏడాది పాలు కొనసాగాలే ప్లాన్ చేసుకుంటున్నాడు. వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్ ను కన్ఫామ్ చేయడంతో స్వదేశంలో సొంతగడ్డపై 200వ టెస్టుకు కంప్లీట్ చేయబోతున్నాడు మాస్టర్. దీని తర్వాత సౌతాఫ్రికా టూర్ డైలమాలో పడింది. ఒకవేళ అది రద్దైనా..జనవరిలో న్యూజీలాండ్ టూర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జూలై ఆగస్ఠులో ఇంగ్లండ్ టూర్ ఉంటుంది. ఈ సిరీస్ వరకు ఆడే విధంగా సచిన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.