సైనా వర్సెస్ సింధు – సర్వత్రా ఆసక్తి

Saturday, August 31st, 2013, 12:20:27 AM IST

saina-sindu
సీనియర్ వర్సెస్ జూనియర్.. గెలుపు వర్సెస్ ఓటమి.. తెలుగు తేజంతో మరో తెలుగు తేజం పోరాటం.. ఓటమి కసితో రగిలిపోతున్నది ఒకరైతే. విజయాల యాత్రను కంటిన్యూ చేయాలని చూస్తున్నది మరొకరు. ఇలాంటి ఈక్వేషన్స్ ఐబీఎల్ ఫైనల్ పై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన సింధు ఐబీఎల్ లో పడి లేస్తూ ఆడుతోంది. తొలి మ్యాచ్ లో సైనా పై ఓటమి పాలై.. ఆ తర్వాత పుంజుకుంది. వరల్డ్ క్లాస్ షట్లర్ కు సైతం ముచ్చెమటలు పట్టించి విజయం సాధిస్తోంది. ముంబై మాస్టర్స్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అవధ్ వారియర్స్ కెప్టెన్ అద్భుతంగా ఆడింది. టిన్ బానేపై గెలిచి తమ జట్టును ఫైనల్ కు చేరవేసింది.

అవధ్ వారియర్స్ కెప్టెన్ పీవీ సింధు సెమీ ఫైనల్లో సత్తాచాటింది. ప్రపంచ 11వ ర్యాంకర్ టినేబాన్ పై ఈ టోర్నీలో వరుసగా రెండో సారి విజయం సాధించింది. 32 నిమిషాల పాటు సాగిన పోరులో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 21-16, 21-13తేడాతో టినే బాన్‌పై సునాయాసంగా నెగ్గింది.

మరోవైపు సైనా నెహ్వాల్ ఐబీఎల్ లో ఓటమి అన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర సాగిస్తోంది. తొలి మ్యాచ్ లో సింధును ఓడించిన సైనా , ఆ తర్వాత టినే బాన్ , జులియన్ షెంక్ వంటి వాల్డ్ క్లాస్ షట్లర్ ను చిత్తు చేస్తూ వచ్చింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో మళ్లీ సింధుతో పోరాటానికి సిద్ధమైంది.. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన సింధు ఈ మ్యాచ్ లోనైనా సైనా పై గెలిచి తీరాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. అటు సైనా ఫైనల్ కూడా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పై ఆడియన్స్ లో ఉత్కంఠ పెరిగింది. ముంబై జరగబోయే ఫైనల్ మ్యాచ్ ను సింధు వర్సెస్ సైనా గా అభివర్ణిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జరగబోయే పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.