సైనా ఆట లయ తప్పుతోంది..!

Saturday, August 10th, 2013, 02:13:16 PM IST

saina

ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సైనా నెహ్వాల్ తుస్సుమంది. చైనా క్రీడాకారీణులు కొద్దిమందే పాల్గొంటున్న ఈ టోర్నీలో సైనాకు మెడల్ గ్యారెంటీ అనుకున్నారంతా. క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే కనీసం కాంస్యం అయినా దక్కుతుందని ఆశ. కానీ సీన్ రివర్స్ అయింది. క్వార్టర్ వరకు బాగానే గెలిచింది. తర్వాతే కథ అడ్డం తిరిగింది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఇటీవలి కాలంలో కీలక మ్యాచుల్లో ఓడిపోవడం అలవాటుగా చేసుకున్న సైనా.. మరోసారి అదే రిపీట్ చేసింది. క్వార్టర్లో చెత్త ఆటతో పతకం ఆశలు గల్లంతు చేసుకుంది.

2012 లండన్ ఒలింపిక్స్ నుంచి సైనా ఆట లయ తప్పింది. ఒలింపిక్స్ తర్వత జరిగిన ఒక్క టోర్నీలోనూ టైటిల్ కొట్టలేకపోయింది. క్రమం క్రమంగా దిగజారిపోయింది. తన ఫేవరెట్ గ్రాండ్ ప్రీ టైటిల్స్ ను నిలబెట్టుకోలేకపోయింది. నిజానికి లండన్ ఒలింపిక్స్ కు ముందు కూడా సైనా ఫామ్ ఏమంత మంచిగా లేదు. అంతకు ముందు టోర్నీల్లోనూ వరుసగా ఓడిపోయింది. లండన్ ఒలింపిక్స్ కోసం తీవ్రంగా శ్రమిచింది. అదృష్టం కలిసొచ్చి అపొజిషన్ ప్లేయర్ గాయంతో తప్పుకోవడంతో సైనాకు పతకం దక్కింది. లక్ కలిసొచ్చినా…సైనా పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని అందరు సంబరపడ్డారు. సైనాను ఆకాశానికెత్తారు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఒక్క సారిగా సైనా లైఫ్ స్టయిలే మారిపోయింది. బిఎమ్ డబ్ల్యూ కార్లలో తిరుగుతూ తన స్టేటస్ పెరిగిందని రుజువు చేసింది. మల్టినేషనల్ కంపెనీస్ కూడా సైనాను తమ బ్రాండ్ అంబాసిడర్ చేసుకునేందుకు ఆరాటపడ్డాయి. దీంతో ఆర్ధికంగా కూడా బాగా ఎదిగింది.

ఆ తర్వాత సైనాలో ఆటతీరులో మార్పు వచ్చింది. ఒలింపిక్స్ పతకం గెలిచాక భారం దిగిపోయిందునుకుందో.. లేదా.. ఇక సాధించాల్సింది ఏమిలేదనుకుందోగాని.. సైనా సరిగ్గా ఆడలేదు. అప్పటి నుంచి తాజా సిరీస్ వరకు టోర్నీల్లో పాల్గొంటున్నా.. రిక్త హస్తాలతో తిరిగొస్తుంది. ఏడాదికి దాదాపు ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకునే సైనా.. ఒలింపిక్స్ తర్వాత ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిందంటే.. ఏమనుకోవాలి. ఒలింపిక్స్ కు ముందు కఠోర సాధన చేసిన సైనా.. ఆ తర్వాత ఆ సాధన మరించింది. ప్రాక్టీస్ కూడా తగ్గించింది. ర్యాంకు కూడా దిగజారింది. చైనా అమ్మాయిలను గెలవలేకపోతోంది. సైనా ఆటగాడి తప్పడంతో స్పాన్సర్లు కూడా వెనుకడుగు వేస్తున్నారు. రిథీ స్పోర్ట్స్ 40 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా క్రమంగా దూరమవుతున్నాయి.

ప్రతి టోర్నీల్లోనూ ఒకటో రౌండ్ రెండో రౌండ్ ప్లేయర్ గానే మిగిలిపోతోంది. తనకంటే జూనియర్ ఏపీ యువకెరటం పీవీ సింధూ దూసుకుపోతుంటే సైనా మాత్రం ఆ సత్తా ప్రదర్శించలేకపోతోంది. ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెడుతున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో సైనాకు కళ్లు చెదిరే ధర పలికింది. పీవీపీ గ్రూప్ హైదరాబాద్ హాట్ షాట్స్ సైనాకు దాదాపు 80 లక్షలు చెల్లించారు. ఈ టోర్నీ నుంచైనా…సైనా గాడిలోపడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే స్పాన్సర్లు తగ్గారు. కార్పోరేట్ కంపెనీలు క్రమ క్రమంగా దూరమవుతున్నాయి. అభిమానులు కూడా సింధూ జపం చేస్తున్నారు. ఈ పరిస్తితుల్లో తన ఫిట్నెస్ మెరుగుపరుచుకొని. ఇతర విషయాలను పక్కనపట్టి పూర్తిగా బ్యాడ్మింటన్ పై ఏకాగ్రత పెడితే ఫలితం ఉంటుంది లేదంటే.. కష్టమే.

ఐబీఎల్ సైనాకు మంచి ఛాన్స్.. హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న సైనా సొంత అభిమానుల ఆదరణ మధ్య మళ్లీ తన పూర్వపు ఫామ్ ను అందుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో కోర్టులో సత్తాచాటాలి. ముందు తనపై తాను నమ్మకం పెట్టుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలి. ఐబీఎల్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి ఆ తర్వాత జరిగే టోర్నీల్లో తానేంటో నిరూపించి మళ్లీ సైనా అంటే ఏంటో నిరూపించాలని కోరుకుందాం.