హైదరాబాద్ లో సల్మాన్ సోదరి వివాహ సందడి షురూ

Tuesday, November 18th, 2014, 11:37:34 AM IST


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఆయుష్ శర్మతో హైదరాబాద్ లోని ఫలక్ నూమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. అర్బిత, ఆయుష్ శర్మల వివాహం ఈ మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు. ఈ వివాహా వేడుకలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు కూడా పాల్గొనున్నారు. మొత్తం 300 మంది ఆహ్వానితులు వస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుక కోసం హైదరాబాద్ రానున్నారు. దీంతో నేడు హైదరాబాద్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కళకళలాడుతోంది.

సల్మాన్ తన సోదరి పెళ్లి చాలా భారీగా చేస్తున్నాడు. ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయడానికి.. కేవలం ఒక్క వేదిక కోసమే అక్షరాలా రెండు కోట్లు ఖర్చు పెట్టాడట. అది కూడా కేవలం రెండు రోజులకు చెల్లించినట్టు సమాచారం.

ఇక సల్మాన్ బావా ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆయుష్ శర్మ. అర్పిత-ఆయుష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముంది పెళ్లి ధూంధామ్ గా చేయాలని నిర్ణయించారు. ఈ వివాహం ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం చేస్తున్నారు. ఈ రోజు (నవంబర్18) సల్మాన్ తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్‌ల పెళ్లిరోజు. సరిగ్గా ఇదేరోజున అర్పిత పెళ్లి చేస్తున్నారు.