స‌న‌త్ న‌గ‌ర్ సీటు చుట్టూ ఉచ్చు?

Saturday, October 27th, 2018, 11:22:13 AM IST

గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే తాజా ఎన్నిక‌ల్లో మాత్రం స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ సీట్‌గా మారింది. ఇక్క‌డి నుంచి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయ‌న ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల కార‌ణంగా తెరాస గూటికి చేరారు. అదే పార్టీలో మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాల‌తో పాటు టీడీపీ కూడా భారీ విమ‌ర్శ‌లు చేసింది. త‌మ పార్టీ త‌రుపున గెలిచిన తల‌సానిని ఎలా పార్టీలో చేర్చుకుంటార‌ని, ఎలా మంత్రిని చేస్తార‌ని, ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించాయి. అయినా కేసీఆర్ ముందు ఊదుడు.. చెవిటివాడి ముందు శంఖం ఊదిన‌ట్టే అయింది.

తాజా ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన ఆశావాహులు ఇదే సీటు నుంచి పోటీకి దిగుతామంటూ ఉవ్విళ్లూరుతుండ‌టం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌హాకూట‌మిలో కాంగ్రెస్‌తో టీడీపీ జ‌ట్టుక‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇంకా సీట్ల స‌ర్దుబాటు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అభ్య‌ర్థులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. రేపే మాపో టికెట్‌ల స‌ర్తుబాటు జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో స‌న‌త్ న‌గ‌ర్ నుంచి కాంగ్రెస్ త‌రుపున బ‌రిలోకి దిగ‌డానికి మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారు. టీడీపీ నుంచి కూన వెంక‌టేష్ గౌడ్ పోటీప‌డుతున్నాడు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, నారా లోకేష్‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్న కూన వెంక‌టేష్ గౌడ్ ఇప్ప‌టికే త‌న ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టేశాడు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి మాత్రం అధిస్థానాన్ని కాద‌ని ప్ర‌చారం చేయ‌డానికి సాహ‌సించ‌డం లేదు. ఇదే నియోజ‌క వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున పోటీకి దిగ‌డానికి బండారు ద‌త్తాత్రేయ త‌న‌యుడు ప్ర‌దీప్‌కుమార్ సై అంటూ కాలుదువ్వుతున్నాడు. దీంతో ఈ నియోజ‌క వ‌ర్గం అన్ని ప్ర‌ధాన పార్టీల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. ఇంత మందిపోటీకి దిగితే ఈసారి సిట్టింగ్ ఎమ్మ‌ల్యే త‌ల‌సానికి కాలం క‌లిసొస్తుందా? లేదా? అని పందాల రాయుళ్లు జోరుగా పందాలు కాస్తుండ‌టం కొస‌మెరుపు.