బయటపడ్డ 5 వేల కోట్ల ఆస్తి..శశికళ ఇంకెంత దాచి ఉందో..!

Sunday, January 14th, 2018, 03:19:06 PM IST

శశికళ అవినీతి చిట్టాలో లెక్క రూ 5 వేల కోట్లు దాటేసింది. అప్పుడే షాక్ అవ్వకండి ఇంకా ఉంది అని ఐటి అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. తరగని గనిలా శశికళ అక్రమాస్తుల వివారాలు బయట పడుతూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్ లో ఐటి అధికారులు పలు చోట్ల శశికళ ఆస్తులపై ఏకకాలంలో రైడ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. శశికళ ఆస్తులకు సంబందించిన పలు పత్రాలని ఐటి అధికారులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పన్ను కట్టకుండా ఎగవేత ద్వారా శశికళ కూడబెట్టిన ఆస్తులు ఇప్పటి వరకు రూ 5 వేల కోట్లకు చేరుకున్నాయని అంటున్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

గత ఏడాది నవంబర్ 9 న శశికళ కు చెందిన 200 చోట్లకు పైగా ప్రాంతాల్లో ఆమె ఆస్తులపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో 100 కు పైగా ప్రాంతాల్లో చెన్నై లోనే ఉండడం విశేషం. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలలో ప్రాధమికంగా ఐటి అధికారులు రూ 1500 కోట్ల ఆస్తులని గురించారు. విచారణ పెరుగుతున్న కొద్ది శశికళ ఆస్తుల చిట్టా కూడా నివ్వెరపోయేలా పెరుగుతూనే ఉంది. చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలో కూడా కీలకమైన ఆధారాలని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

20 కి పైగా ఫేక్ కంపెనీలని సృష్టించి వాటిలోకి అధిక మొత్తంలో తన అక్రమ నగదును శశికళ బదిలీ చేసినట్లు తెలుస్తోంది. శశికళ, ఇరవలసి వారి బంధువుల పేరిట పలు ఆస్తులు ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించారు. కాగా అనారోగ్య కారణాలతో శశికళ అక్క కుమారుడు దినకరన్ వికాహరణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు. అతడు కనుక హాజరైతే శశికళ దాచిపెట్టి ఉన్న అక్రమ ఆస్తుల గని మొత్తం బట్టబయలయ్యే అవకాశం ఉంది.