అసలు చిన్నమ్మకు చిక్కులు ఎలా మొదలయ్యాయి..?

Tuesday, February 14th, 2017, 12:09:23 PM IST


సుప్రీం కోర్టు శశికళని దోషిగా నిర్ధారించడంతో ఆమె వర్గం పూర్తి నైరాశ్యం లోకి వెళ్లింది. నేటి తీర్పు కోసం ఆమె రాత్రంతా నిద్రలేకుండా మేల్కొని ఉన్నట్లు తెలుస్తోంది. తీర్పు తనకు అనుకూలంగా రాకపోతుందా అని ఆశగా ఎదురుచూసిందట. కానీ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసిన సుప్రీం శశికళని దోషిగా నిర్ణయిస్తూ ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఈ కేసులో ఏ 1 ముద్దాయిగా ఉండగా, శశికళ ఏ 2 గా ఉన్నారు. ఇళవరసి, సుధాకరన్ లు కూడా ఈ కేసులో ఇతర నిందితులు.శశికళని గోల్డెన్ రిసార్ట్ లో ఏక్షణానైనా అరెస్ట్ చేసి జైలు కు తరలించే అవకాశం ఉంది. 1996 లో మొదలైన ఈ కేసు ఇప్పటివరకూ కొనసాగడం విశేషం.

జయలలిత తొలిసారి 1991 – 96 మధ్యలో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ఆసమయం లో జనతా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సుబ్రమణ్యస్వామి కోర్టులో ఈ కేసు దాఖలు చేయడం విశేషం. జయలలిత ఆదాయానికి మించి ఆస్తులను పోగేసుకున్నారని ఆరోపిస్తూ మద్రాసు హై కోర్ట్ లో కేసు నమోదైంది. దాదాపు రూ 66 కోట్ల అక్రమాస్తులు ఆమె కు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందులో ఇతరనిందితులుగా శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను పేర్కొన్నారు. కొంతకాలం పాటు హై కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది. అనంతరం 2001 లో జయలలిత తిరిగి అధికారం లోకి వచ్చారు. దీనితో మద్రాస్ హై కోర్ట్ లో విచారణ నిస్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని డీఎంకే పార్టీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనితో 2003 లో సుప్రీం ఈ కేసుని కర్ణాటక లోని ప్రత్యేక కోర్టు కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రత్యేక కోర్టు 2014 లో జయలలిత, శశికళ సహా నలుగురు నిందితులని దోషులుగా ప్రకటిస్తూ నాలుగేళ్లు జైలుశిక్ష విధించింది. కొంతకాలం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జయ జైలులో కూడా ఉన్నారు.

నిందితులు కింది కోర్టు తీర్పుని కర్ణాటక హై కోర్టు లో సవాల్ చేయగా కోర్టు జయకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేసిన కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఫిబ్రవరి నుంచి విచారణ ప్రారంభించిన సుప్రీం నేడు తీర్పు ఇవ్వడం విశేషం.శశికళని దోషిగా ప్రకటిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు సంచలనమనే చెప్పాలి.