లేటెస్ట్ న్యూస్ : ఎస్ బిఐ, పిఎన్ బి ఆస్తుల వేలం!

Sunday, April 8th, 2018, 07:02:47 PM IST

భారతీయ స్టేట్ బ్యాంకు తో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తమ వద్ద ఉన్న నిరర్థక ఆస్తులను ( నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) అమ్మకానికి పెట్టాయి. ఇప్పటికే మొండి బకాయిలు పేరుకుపోవడంతో, సతమవుతున్న బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్‌పీఏలను వేలానికి వేయాలని నిర్ణయించాయి. 2017, డిసెంబరు 31 నాటికి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.7.33లక్షల కోట్ల మొండిబకాయిలు ఉన్నాయి. ఇందులో ఎస్‌బీఐకి అత్యధికంగా రూ.2.01లక్షల కోట్ల మొండిబకాయిలు ఉండగా, పీఎన్‌బీకి రూ.55,200కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌ రూ.44,542కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.38,047కోట్ల బకాయిలు ఉన్నాయి.

దీనికి సంబంధించి ఈ-వేలం కార్యక్రమాన్ని ఈనెల 20న నిర్వహించనున్నట్లు ఆయా బ్యాంకుల అధికారులు ఇటీవల ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రెండు బ్యాంకులు రూ.1,063కోట్ల విలువ చేసే 15 నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)లను అమ్మకానికి పెడుతున్నాయి. మొత్తం 12 ఖాతాలకు చెందిన రూ.848.54కోట్ల ఆస్తులను వేలానికి పెడుతున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా నిలిచిన పీఎన్‌బీ మూడు ఖాతాలకు చెందిన రూ.214.45కోట్ల విలువ చేసే ఆస్తులను వేలం వేయనుంది. మీరట్‌కు చెందిన సిధాబలి ఇస్పాత్‌ లిమిటెడ్‌(రూ.165.30కోట్లు), చెన్నై శ్రీగురుప్రభ పవర్‌ లిమిటెడ్(రూ.31.52కోట్లు), ముంబయిలోని ధర్మనాథ్‌ ఇన్వెస్టిమెంట్‌(రూ.17.63కోట్లు)కి చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి….