ఏపీ రాజధాని నిర్మాణం కోసం పలు నమూనాలను పరిశీలించేందుకు రంగంలోకి దిగిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని కమిటీ త్వరలో సింగపూర్, చైనాలో పర్యటించనుంది. ఈ నెల 22 నుంచి 26 వరకు సింగ్‌పూర్, పుత్రజయలో పర్యటించనుంది. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ వచ్చే నెల 5 నుంచి 9 వరకు చైనాలోని కుజో, షాంజో నగరాల్లో పర్యటిస్తామని చెప్పారు.
చండీగఢ్, గాంధీనగర్, నయా రాయ్‌పూర్‌లో ఇప్పటికే పర్యటించామని, అన్ని ప్రాంతాల్లోనూ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలోని రాజధానుల్లో చండీగఢ్ మోడల్ చాలా బాగుందని మంత్రి నారాయణ అన్నారు.
ఏపీ రాజధాని నగరాన్ని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని, దీనికి కనీసం 12,500 ఎకరాల భూమి అవసరమని అంచనా వేసినట్టు మంత్రి నారాయణ చెప్పారు. ఇందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాల్సిందిగా కృష్ణా-గుంటూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు తెలియజేశారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు ఎంత భూమి ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదని మంత్రి చెప్పారు. తెనాలి, ఇబ్రహీంపట్నం, విజయవాడ, గన్నవరం పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.
భూ సేకరణకు సంబంధించి ముంబయి, ఢిల్లీలో అనుసరించిన విధానాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థను నెలలోగా ఏర్పాటు కానుందని నారాయణ తెలియజేశారు.