మొక్కు కుటుంబానిది..డబ్బు ప్రజలది..!

Thursday, February 23rd, 2017, 08:47:18 AM IST


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీవారికి రూ 5 కోట్ల విలువైన ఆభరణాలు కానుకలుగా సమర్పించడంపై సరికొత్త వివాదం రగులుతోంది. కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన కుటుంబ మొక్కులకు తీర్చుకోవడానికి ప్రజాధనం వినియోగించుకోవడం ఏంటని కాంగ్రెస్ పార్టీ మండి పడుతోంది. కేసీఆర్ కుటుంబ సమేతంగా బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని దాదాపు రూ 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించారు. ఇందులో 14 కిలోలు ఉన్న సాలగ్రామ హారం విలువే రూ 3.7 కోట్లు ఉంటుంది. ఇక 4.65 కిలోలు ఉన్న మరకంఠి విలువ రూ.1.2 కోట్లు ఉంటుంది. ఇక తిరుచానూరు సందర్శించిన కేసీఆర్ దంపతులు పద్మావతి అమ్మ వారికి ముక్కుపుడకని సమర్పించారు.

ఈ ఆభరణాలకు మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరించినట్లు తెలుస్తోంది. ఈ ఆభరణాల తయారీకి బాధ్యతని కోయంబత్తూర్ లోని కీర్తిలాల్ కాళిదాస్ జ్యుయలర్స్ చేపట్టగా, ఆభరణాల నమూనా సాయం మాత్రం టిటిడి చేసినట్లు తెలుస్తోంది.ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేసీఆర్ పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే టీడీడీ మాత్రం కేసీఆర్ శ్రీకృష్ణ దేవరాయలు అంతటివారని కీర్తిస్తోంది. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారికి విలువైన ఆభరణాలు అందిస్తే, ఇప్పుడు కేసీఆర్ భక్తితో బంగారు ఆభరణాలు చేయించారని అంటున్నారు.