జయలలిత మరణం వెనుక దాగున్న అసలు నిజం ఇదా..?

Thursday, March 22nd, 2018, 11:37:22 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన నివాసంలోని బాత్రూంలో పడి స్పృహకోల్పోయిన తరువాతే ఆమెను హాస్పిటల్‌కు తీస్కువచ్చామని ఆమె స్నేహితురాలు శశికళ వెల్లడించారు. సంపాదనకి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు దోషిగా 2014 సెప్టెంబర్‌లో నిర్ణయించిన తరువాత జయ ఆరోగ్యం చాప కింద నీరులా క్షీణించిందని, దాంతో ఆమె 2014 నవంబర్ నుంచి 2016 సెప్టెంబర్ మధ్యన దాదాపు 20 మంది డాక్టర్ల వద్ద ప్రత్యేక చికిత్స పొందారని శశికళ తెలిపారు. జయ మృతిపై నిజనిర్ధారణ కోసం ఏర్పాటుచేసిన జస్టిస్ ఆర్ముగసామి కమిషన్‌కు.. 55 పేజీల అఫిడవిట్‌ను గతవారం శశికళ సమర్పించారు. 2016 సెప్టెంబర్ రాత్రి 9 గంటలపుడు జయ తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో పడి స్పృహ కోల్పోగా తాను తీసుకువెళ్లి మంచంపై తానె పడుకోబెట్టానని. తరువాత ఆమెను అపోలో హాస్పిటల్‌కు తరలించామని, అప్పుడు కూడా ఆమె స్పృహలో లేరని శశికళ అఫిడవిట్‌లో వివరంగా వెల్లడించారు. ఆ మరుసటిరోజు మాత్రం జయ ఆరోగ్యం బాగుపడి మాట్లాడారని పేర్కొన్నారు. జయ దవాఖానలో ఉండగా నాటి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రెండుసార్లు వచ్చి పరామర్శించి వెళ్ళారని, జయ ఆయనను చూసి చేయి ఊపారని పేర్కొన్నారు. నాటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై, కార్మికమంత్రి నిలోఫర్ కఫీల్‌తోపాటు, పలువురు మంత్రులు పార్టీ నాయకులు దవాఖానకు వచ్చారని ఆమెపై ఉన్న అభిమానాన్ని వ్యక్తీకరించారని అన్నారు. జయ క్రమంగా సాధారణ పోషకాహారం తీసుకొంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేశారని, ఉప ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే అభ్యర్థుల అఫిడవిట్లపై వేలిముద్ర వేసినపుడు జయ స్పృహలోరనే ఉన్నారని పేర్కొన్నారు.