144 సెక్ష‌న్‌తో హింసిస్తున్న ప్ర‌భుత్వం!

Thursday, January 26th, 2017, 08:20:12 AM IST

vizag
అస‌లు విశాఖ న‌గ‌రంలో 144 సెక్ష‌న్ విధించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏంటి? అక్క‌డ నిజంగానే అసాంఘీక శ‌క్తుల విధ్వంసం జ‌రిగే ఛాన్సుందా? తుని ర‌త్నాచ‌ల్ ఘ‌ట‌న లాంటివి మ‌ళ్లీ పున‌రావృతం అయ్యే ఛాన్సుందా? తెలుగు యువ‌త మౌన‌పోరాటానికి సిద్ధ‌మ‌వుతుంటే దానిని తేదేపా ప్ర‌భుత్వం అణ‌చివేయాల‌ని అనుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? స‌న్నివేశంలో తీవ్ర‌త ఎంత‌? ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ త‌గ‌ల‌బెట్టిన ఘ‌ట‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాత్ర ఉందంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం సాగించిన ఏపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అదే పార్టీ నుంచి ఏదైనా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని భ‌య‌ప‌డ‌డం వ‌ల్ల‌నే ఇలా 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తూ ప్ర‌త్యేక పోలీస్ బ‌ల‌గాల్ని మోహ‌రిస్తోందా? .. ఇవ‌న్నీ ప్ర‌స్తుతానికి స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు.

వాస్త‌వానికి విశాఖ హిస్ట‌రీలో మ‌రీ అంత ప్ర‌మాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ఏవీ లేవు. విశాఖ శాంతియుతంగా ఉండే సిటీ. ద‌గుల్బాజీల అల్ల‌ర్లతో అట్టుడికిన స‌న్నివేశాలు త‌క్కువ‌. పీస్‌ఫుల్ సిటీగా ఉన్న ఈ న‌గ‌రం `హోదా` మౌన‌పోరాటంతో అల్ల‌క‌ల్లోలం అవుతుంద‌ని మ‌రీ అంత అతిజాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారా? న‌గ‌రంలో ప‌లుచోట్ల చెక్‌పోస్టులు పెట్టి బీచ్ వైపు ఎవ‌రినీ వెళ్ల‌నీకుండా ఆపేస్తున్నారు. ఓ ర‌కంగా ఇది ప్ర‌జ‌ల్ని హింసించేందుకు ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన విధ్వంస‌కాండ అని చెప్పాలి. స్వేచ్ఛ‌ను హ‌రించే దుర్మార్గానికి ప్ర‌భుత్వ‌మే తెగ‌బ‌డుతోంద‌ని భావించాల్సొస్తోందని విప‌క్ష పార్టీలు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నాయి. ఇప్ప‌టికే మౌన పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేనానికి, యువ‌త‌కు ప‌లు అసోసియేష‌న్లు మ‌ద్ధ‌తు ప‌లికాయి. టాలీవుడ్ సైతం మద్ధ‌తు ప‌లికింది. జ‌ల్లిక‌ట్టు త‌ర‌హాలో అమీతుమీ తేల్చుకునేందుకే ఈ మౌన‌పోరాటం అని భావించాల్సొస్తోంది. ఈ ఉద్య‌మం ద్వారా ప‌వ‌న్‌కి కానీ, జ‌గ‌న్‌కి కానీ ఆ క్రెడిట్ ద‌క్క‌డం చంద్ర‌బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇలా ఉక్కుపాదం మోపుతున్నారు. తెలుగువారికి ద్రోహం చేస్తున్నారంటూ వైకాపా నేత‌లే విరుచుకుప‌డుతున్నారు.