సెల్ఫీ మోజుతో కటకటాలపాలయ్యాడు…

Friday, December 7th, 2018, 04:20:35 PM IST

ఎన్నికల అధికారులు పోలింగ్ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందు నుండే మనల్ని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా కొందరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ సమయంలో గోప్యంగా ఉండాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ముందే వెల్లడించారు. అవేమి పట్టనట్లుగా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. ఓటు వేస్తూ ఫోటో దిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఉప్పర్‌పల్లికి చెందిన శివశంకర్ గా గుర్తించారు. ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవే కాకుండా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యమైందని గొడవలు కూడా జరుగుతున్నాయి. నాలుగు గంటలు ఆలస్యంగా పోలింగ్ నిర్వహిస్తే ఎలా అంటూ కార్వాన్‌లో భాజపా అభ్యర్థి అమర్‌సింగ్‌ ఆందోళనకు దిగారు. రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండమైలారంలో తెరాస మరియు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగి, పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట పోలింగ్‌ కేంద్రంలో తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య గొడవ జరగగా, వారిరువురు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.