డ్రాపైపోయిన శశికళ..తెర పైకి కొత్త ముఖ్యమంత్రి..?

Saturday, February 11th, 2017, 06:01:57 PM IST


”నేను ముఖ్యమంత్రిని కాకపోయినా పరవాలేదు.. కానీ పన్నీర్ సెల్వం మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు” ప్రస్తుతం శశికళ మనసులో ఇదే ఆలోచన ఉందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దీ సేపటి క్రితమే రిసార్ట్ లో తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయిన శశికళ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి తన వర్గంలోనే మరో వ్యక్తి పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అన్నా డీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి పదవి తాను చేపట్టడానికి కోర్టు కేసులు అడ్డు తగులుతున్న నేపథ్యం లో శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కేసుల విషయంలో తీర్పు వెలువడే వరకు ఆగాలని గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ఈ లోపు పన్నీర్ సెల్వం ప్రజాదరణతో పుంజుకునే అవకాశం ఉంది, చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేజారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యం లో శశికళ తన వర్గం ఎమ్మెల్యే లను తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ ముఖ్యమంత్రిగా తనని కాదన్నా తనవర్గం లోని సెంగోట్టయన్ పేరు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ కేసులు, ప్రజావ్యతిరేకత వంటి గొడవలు సద్దు మణిగాక తాను ముఖ్యమంత్రి పీఠం అధిరోహించొచ్చనేది శశికళ ప్లాన్. ఏది ఏమైనా ఇప్పటివరకు ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి పదివి కోసం పోటీ పడుతుండగా మూడో వ్యక్తి తెర పైకి రావడం ఆసక్తికరం.