ఇట్స్ అఫీషియల్: వైసీపీలోకి సీనియర్ హీరో..!

Thursday, January 10th, 2019, 03:44:27 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతున్నట్లు కనిపిస్తోంది, పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రకు అద్దిరిపోయే రేంజ్ లో ప్రజాదరణ రావటమే ఇందుకు నిదర్శనం. గత కొద్దీ కాలంగా పార్టీలోకి సినీ ఇండస్ట్రీ క్యూ కడుతోంది. ఇప్పటికే పలువురు నటులు వైసీపీలో చేరి జగన్ వెంట నడుస్తున్నారు. మరికొందరు ప్రత్యక్షంగా పార్టీలో చేరకపోయినప్పటికీ తెరవెనుక ఉంటూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా వీరికోవలోకి అలనాటి సీనీ హీరో భాను చందర్ చేరిపోయారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు వేడుకల సందర్బంగా ఇచ్చాపురం చేరుకున్న భానుచందర్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ కండువా కప్పి భానుచందర్ ను పార్టీలోకి ఆహ్వానించారు అధినేత వైఎస్ జగన్.

అయితే భానుచందర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొద్ది రోజుల క్రితమే రెడీ అంటూ, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎప్ జగన్ ను గత ఏడాది డిసెంబర్ 23న భానుచందర్ కలిశారు. ఆరోజే తాను పార్టీలో చేరే విషయంపై చర్చించారు. ఏడాది కాలంగా వైఎఎస్ జగన్ పాదయాత్ర చెయ్యడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని భాను చందర్ కోరారు. కాసేపు జగన్ అడుగులో అడుగు వేస్తూ భానుచందర్ పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పలువురు సినీనటులు మద్దతు పలికారు వీరిలో పోసాని కృష్ణమురళీ, పృథ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, సినీనటుడు కృష్ణుడు, జబర్దస్త్ టీం కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. మరి భవిష్యత్తులో వీరందరూ కూడా పార్టీలో చేరతారా లేదో చూడాలి.