జగన్ గూట్లోకి ముఖ్యమంత్రి స్థాయి నేత..?

Wednesday, November 15th, 2017, 03:50:50 AM IST

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ తరువాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో ట్యాంకు ఉన్నత స్థానం లభిస్తుందని ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ ఏపీలో బిజెపి పరిస్థితి అందరికి తెలిసిందే. పైగా బిజెపి అధిష్టానం ఏపీపై అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఇక్కడి నేతల రాజకీయ పునాదులు కదలిపోతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపిన మోడీ, నిధులు కూడా సరిగా విడుదల చేయకపోవడంతో ఇక్కడి బిజెపి నేతలు అటు మీడియాకు, ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ ప్రభావం ఏపీ బిజెపి నేతల రాజకీయ భవిష్యత్తు పై కచ్చితంగా పడుతుంది.

కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో తల పండిన నేత కనుక ఈ విషయాన్ని ముందుగానే గ్రహించారు. పైగా బీజేపీలో ఆయనకు ఎటువంటి పని లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నసమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా కీర్తించబడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి కి సీఎం పదవిని కట్టబెట్టే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం బొత్స, కన్నా లక్ష్మీనారాయణల పేర్లని కూడా తీవ్రంగా పరిశీలించింది. అప్పటికి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ వైపే మొగ్గు చూపడంతో కన్నాకు కొద్దిలో సీఎం పదవి మిస్ అయింది. కాగా కన్నా ఇప్పటికే తన అనుచరులతో రహస్య భేటీలు అవుతున్నట్లు గుంటూరు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ – బిజెపి పొత్తు కొనసాగితే బిజెపి నుంచి పోటీ చేయడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదని కానీ అలా జరగకపోతే మాత్రం బిజెపికి టాటా చెప్పడమే మంచిదని ఆయన అనుచరులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి లో చేరే విషయాన్ని ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నారట.

  •  
  •  
  •  
  •  

Comments