కర్ణాటకలో గెలుపెవరిదైనా అది తెలంగాణ గొప్పతనమే

Saturday, May 5th, 2018, 11:39:30 AM IST

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికల సందడి జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – బీజేపీలతో పాటుగా ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ సైతం తన శక్తియుక్తులన్నీ దారపోస్తోంది. రెండు తెలుగు రాష్ర్టాలకు ఆనుకొని ఉన్న రాష్ట్రం కావడంతో సహజంగానే తెలుగు వారి దృష్టి ఈ రాష్ట్రంపై పడుతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణకు చెందిన ఇద్దరు నాయకులు ఆ పార్టీల ఇంచార్జీలుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా మాజీ ఎంపీ – జాతీయకార్యదర్శి మధుయాష్కిగౌడ్ – బీజేపీ ఇంచార్జీగా ఆ పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యవహరిస్తున్నారు. మధుయాష్కిగౌడ్ రెండు దఫాలు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవిత చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా మురళీధర్ రావు కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి. బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన ఆయన కర్ణాటకలో ఆ పార్టీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. కర్ణాటకలో వారి పార్టీలను గెలిపించుకునేందుకు వీరిద్దరూ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గెలుపు ఏ పార్టీది అయినా..క్రెడిట్ తెలంగాణ వారికే దక్కుతుందని అంటున్నారు.

ఇదిలాఉండగా…ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ మరోసారి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు తమకు చాలా ప్రధానమైనవి అని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో మొత్తం 6 కోట్ల జనాభా ఉందన్న ఆయన.. అందులో తెలుగు ప్రజలు ఒక కోటి జనాభా ఉన్నారని తెలిపారు. తెలుగు ప్రజలందరూ కాంగ్రెస్ కే ఓటేయ్యాలని నిర్ణయించుకున్నారని మధుయాష్కిగౌడ్ పేర్కొన్నారు. మురళీధర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ను తెలుగు ప్రజలందరూ తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ను ఎప్పటికీ మరిచిపోరని ఆయన తెలిపారు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారని మురళీధర్ రావు పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.