రాష్ట్రంలో దుమ్ములేపుతున్న రివర్స్ పంపింగ్ పవర్ ప్రాజెక్ట్…

Thursday, April 12th, 2018, 11:58:32 AM IST

ఆనకట్టలోని నీళ్లు కిందికి వదులుతూ ఉత్పత్తి చేసేదే జలవిద్యుత్! విడుదల చేసిన నీటిని తిరిగి డ్యాంలోకి ఎత్తిపోసుకుని, ఆ నీటిని మళ్లీ జల విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తే! అదే రివర్స్ పంపింగ్!! ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేసిన సమయంలో వినిపించిన ప్రక్రియ! ఇదే పద్ధతిని నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి దేశంలోనే మొట్టమొదటిసారి జెన్‌కో ఉపయోగిస్తున్నది.. ఘన విజయాలు సాధిస్తున్నది. ఫలితంగా పీక్ డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్ సరఫరా చేయడంతోపాటు.. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కోట్లలో ఆదా అవుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే రూ. 94 కోట్లకుపైగా ఆదా అయ్యింది. ఎప్పుడో 40 ఏండ్లక్రితం ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ డిజైన్‌ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుపట్టి వినియోగంలోకి తీసుకువచ్చారు. రాష్ట్ర అవసరాలతోపాటు, దక్షిణాది గ్రిడ్ వైఫల్యం చెందకుండా తక్షణం తలెత్తే విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు నాగార్జునసాగర్‌లో ఉపయోగిస్తున్న రివర్స్‌పంపింగ్ వ్యవస్థ దేశంలోనే మొట్టమొదటిదని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ఒకచోట, మహారాష్ట్రలో చిన్న డ్యాంపై ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ.. వాటిని ఇప్పటివరకు వినియోగంలోకి తేలేదు. దేశంలోనే మొదటిసారిగా రివర్స్‌పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసే వ్యవస్థను వినియోగంలోకి తీసుకొచ్చి మరోసారి దేశానికి తెలంగాణ తన సత్తా చాటింది.

ఫిబ్రవరి 13, 2018 ఉదయం 9 గంటలు! రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దక్షిణాది గ్రిడ్‌లో ఇబ్బందికర పరిస్థితిని ఊహించిన తెలంగాణ జెన్‌కో ఇంజినీర్లు వెంటనే నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని అప్రమత్తంచేశారు. దీంతో నాలుగైదు నిమిషాల్లోనే విద్యుత్ కేంద్రంలోని ఎనిమిది టర్బయిన్లు మొదలై.. 640 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయడంతో గ్రిడ్ పరిస్థితి స్థిరమయ్యింది!! 19.2.2018 ఉదయం 7.30 గంటలు! మళ్లీ అదే పరిస్థితి. నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలోని అన్ని పంపులను మొదలుపెట్టడంతో కేవలం పది నిమిషాల్లో 631 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది!! మార్చి 18, 2018 ఉదయం 7.30 గంటలకు తిరిగి అదే పరిస్థితి. ఈసారి 614 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి దక్షిణాది గ్రిడ్‌ను బలోపేతం చేశారు. రాష్ట్ర అవసరాలను తీర్చారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! గడిచిన రెండున్నర నెలల కాలంలో.. దక్షిణాది గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. రాష్ట్రంలో తలెత్తే గరిష్ఠ డిమాండ్‌కు అనుగుణంగా సాగర్ జల విద్యుత్ కేంద్రం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంది. మరి విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు ఎక్కడిది? రివర్స్ పంపింగ్‌లో తిరిగి డ్యాంలోకి చేరిన నీరే అది! గతంలో జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే.. నీరు వృథాగా నదిలోకి వెళ్లిపోయేది. రివర్స్ పంపింగ్ ఈ పరిస్థితిని తిరగరాసింది. ఈ పద్ధతిని ఈ ఏడాది జనవరి 18 నుంచి జెన్‌కో అధికారులు పకడ్బందీగా అమల్లోకి తెచ్చారు.